ఒకప్పుడు శాసనసభ సమావేశాలలో కేసీఆర్ పులిలా గర్జించేవారు. కానీ ఓటమి తర్వాత శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. సిఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు శాసనసభ సమావేశాలకు రావాలని కేసీఆర్‌ని పదేపదే కోరినా హాజరు కాకపోవడంతో ఆయనను విమర్శించేందుకు వారికి అవకాశం లభించింది.
శాసనసభ సమావేశాలకు మొహం చాటేసిన కేసీఆర్ నల్గొండ సభకు ఎలా వెళ్ళగలిగారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు కేసీఆర్ కానీ బిఆర్ఎస్ పార్టీ నేతలు గానీ ఎవరూ జవాబు చెప్పనే లేదు.
ఈ నెల 24వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగబోతున్నాయి. ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క తొలిసారిగా 2024-25 ఆర్ధిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. కనుక ఎన్నికల హామీలు, వాటికి బడ్జెట్ కేటాయింపులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంచి అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ మంత్రులకు పరిపాలన చాతకాదని కేటీఆర్ వాదిస్తున్నారు కనుక పదేళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఏ అంశంపైనైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలరు.
కనుక కేసీఆర్ శాసనసభ సమావేశాలకు వస్తే బిఆర్ఎస్ పార్టీ తన వాదనలను గట్టిగా వినిపించగలదు. ఒకవేళ ఈసారి కూడా కేసీఆర్ మొహం చాటేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయ ఆధిపత్యాన్ని ఆయన కూడా అంగీకరించిన్నట్లవుతుంది. మరి వస్తారో రారో?