తెలంగాణలో చాలా భారీ అంచనాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఈ 7 నెలల్లో మూడుసార్లు అధికారుల బదిలీలు, కొన్ని హామీల అమలు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకోవడం, కేసీఆర్ పాలనలో అక్రమాలపై విచారణలు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు మొదలవనే లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు సిఎం రేవంత్ రెడ్డిపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ పాలనలో ఇంతవరకు తన ముద్ర కనబడేలా చేసిన్నట్లు కనపడదు.
దీనికి కారణం ఇటు బిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రమాదం పొంచి ఉండటం, అటు పార్టీలో పదవుల కోసం ఒత్తిళ్ళు, ఆ కారణంగా కాంగ్రెస్ అధిష్టానంతో నిరంతర చర్చల కోసం తరచూ ఢిల్లీ పర్యటించవలసి వస్తుండటం, నిధుల కొరత వంటి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
బహుశః అందువల్లే ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్నట్లుంది. తెలంగాణ డిజిపి రవిగుప్తాని హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించి, ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ని డిజిపిగా నియమించిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
సుధీర్ బాబు: రాచకొండ కమిషనర్
తరుణ్ జోషి: ఏసీబీ డైరెక్టర్
మహేష్ భగవత్: లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ
బాలస్వామి: ఈస్ట్ జోన్ డీసీపీ
చంద్రమోహన్: సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ
గిరిధర్: - వనపర్తి ఎస్పీ
డి. ఉదయ్ కుమార్ రెడ్డి: మెదక్ ఎస్పీ
రక్షితమూర్తి: హైదరాబాద్ సీఏఆర్ హెడ్ క్వాటర్స్ డీసీపీ
స్వాతి లక్రా: హోం గార్డ్స్ అడిషనల్ డీజీ
స్టీఫెన్ రవీంద్ర: - గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ
సంజయ్ కుమార్ జైన్: టిజిఎస్ పోలీస్ బెటాలియన్ అడిషనల్ డీజీ
చంద్రశేఖర్ రెడ్డి: మల్టీ జోన్-1 ఐజీ
సత్యనారాయణ: మల్టీ జోన్-2 ఐజీ
రమేష్ నాయుడు: రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీ.