పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉందిగా?

July 11, 2024


img

ప్రస్తుతం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మనుగడకు చాలా కీలకంగా మారడంతో, ఇదే అదునుగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారీగా నిధులు, రుణాలు సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే అమరావతి, పోలవరం వంటి భారీ ప్రాజెక్టులకు నిధులు సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

టిడిపికి చెందిన రామ్మోహన్ నాయుడు పౌరవిమానయాన శాఖ మంత్రి కావడంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేయిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కొత్తగా ఓ విమానాశ్రయం ఏర్పాటుకి కృషి చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కూడా కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.     

నిధులు సాధించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాల గురించి ఇటీవల ‘బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్’లో ఓ కధనం వచ్చింది. దానిని ట్యాగ్ చేస్తూ కేటీఆర్‌ “కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి ఓ బలమైన ప్రాంతీయ పార్టీని ఎన్నుకోవడం ఎంత అవసరమో ఇది నిరూపిస్తోంది. తెలంగాణ ప్రజలు దీనిని నిశితంగా గమనిస్తున్నారని ఆశిస్తున్నాను. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష,” అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

తెలంగాణ ప్రజలు వరుసగా రెండు పర్యాలు తమ పార్టీకే అధికారం కట్టబెట్టినప్పుడు, కేసీఆర్‌ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సఖ్యతగా ఉంటూ తెలంగాణకు నిధులు, తన పార్టీ ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు సాధించుకునే అవకాశం ఉంది. కానీ అధికారంలో ఉన్నంత కాలం ప్రధాని మోడీతో కయ్యమాడుతూ, అవహేళన చేస్తూ, హైదరాబాద్‌ వస్తే అవమానకరంగా వ్యవహరిస్తుండేవారు. కేసీఆర్‌ ధోరణి, రాజకీయాల వలననే కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులు నిలిచిపోయాయని చెప్పక తప్పదు. 

రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారైనప్పటికీ, ప్రధాని నరేంద్రమోడీతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

కనుక తమ ధోరణి వలననే తెలంగాణకు నష్టం జరిగిందని ఒప్పుకోవలసిన కేటీఆర్‌, చంద్రబాబు నాయుడుని చూపిస్తూ బలమైన ప్రాంతీయ పార్టీని ఎన్నుకోవడం ఎందుకు అవసరమో చెపుతుండటం చాలా హాస్యస్పదంగా ఉంది కదా?


Related Post