ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కే కేశవ్ రావు, ముందుగా రాజ్యసభ సీటుకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనర్హత వేటు పడకుండా తప్పించుకునేందుకే ఆయన రాజీనామా చేశారని, ఉప ఎన్నికలో మళ్ళీ ఆ సీటు ఆయనకే ఇస్తామనే హామీతో కాంగ్రెస్ పార్టీలో చేరారని ఊహాగానాలు వినిపించాయి.
కానీ సిఎం రేవంత్ రెడ్డి ఆయనను క్యాబినెట్ మంత్రి హోదా కలిగిన సలహాదారు పదవిలో నియమించడంతో, ఆయనకు మళ్ళీ రాజ్యసభ సీటు ఇవ్వడం లేదని స్పష్టమైంది. ఆ సీటుని సీనియర్ నేత, సిఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అద్దంకి దయాకర్‌కు ఇవ్వబోతున్నట్లు తాజా సమాచారం.
ఆయనను తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేస్తారని, వరంగల్ నుంచి లోక్‌సభకు టికెట్ ఇస్తారని ఊహాగానాలు వినిపించాయి. అవి వాస్తవమే అయినప్పటికీ ప్రతీసారి రాజకీయ అవసరాలు సమీకరణాల వలన అద్దంకి దయాకర్‌ని పక్కన పెట్టి వేరేవారికి అవకాశం కల్పించాల్సివస్తోంది.
కానీ ఇప్పుడు కేకే ఖాళీ చేసిన రాజ్యసభ సీటు పదవీ కాలం ఇంకా రెండేళ్ళు ఉన్నందున దానిని అద్దంకి దయాకర్‌కే ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన్నట్లు సమాచారం. దీనిని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ధృవీకరించవలసి ఉంది.