ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజా భవన్‌లో ముఖాముఖీ సమావేశం కానున్నారు. పదేళ్ళుగా అపరిష్కృతంగా ఉండిపోయిన విభజన సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో తొలిసారిగా వారిరువురూ నేడు సమావేశమవుతున్నారు.
వాటిలో చాలా వరకు సంక్లిష్టమైన సమస్యలే ఉన్నాయి. అప్పులు, బకాయిలు వంటి అనేక చిక్కు ముడులు కూడా ఉన్నాయి. కనుక రెండు ప్రభుత్వాలు ఎంతో చిత్తశుద్ధితో పట్టుదలగా ప్రయత్నిస్తే తప్ప వాటన్నిటినీ పరిష్కరించడం చాలా కష్టమే.
ముఖ్యంగా విభజన సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగు ముందుకు వేయడం చాలా కష్టమవుతుంది.
చంద్రబాబు నాయుడు మళ్ళీ నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నప్పుడు ఆయనకు స్వాగతం చెపుతూ దారి పొడవునా టిడిపి నేతలు ఫ్లెక్సీ బ్యానర్లు, టిడిపి జెండాలు కడితేనే బిఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇక షెడ్యూల్ 9,10 ఆస్తులలో వాటాలను, కృష్ణా గోదావరి జలాలలో ఏపీకి వాటా పంచి ఇవ్వాలనుకుంటే బిఆర్ఎస్ పార్టీ నేతలు చూస్తూ ఊరుకుంటారా?
ముఖ్యంగా రెండు వరుస ఓటములు, ఫిరాయింపులతో ఢీలా పడిన బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ ప్రజల మద్యకు వెళ్ళి బలోపేతం చేసుకోవడానికి ఇది చక్కని అవకాశం కల్పిస్తుంది. కనుక విభజన సమస్యల కంటే బిఆర్ఎస్ పార్టీ చేయబోయే రాజకీయాలే ప్రధాన అవరోధాలుగా మారే అవకాశం ఉంటుంది.
మరి ఈ సమస్యలు ఎప్పటికీ ఎవరూ పరిష్కరించలేరా? అంటే అధికారులు, నిపుణులతో కమిటీలు వేసి వారి నిర్ణయాలకు రెండు ప్రభుత్వాలు కట్టుబడి ఉండేందుకు అంగీకరిస్తే సాధ్యమే. కానీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరిపై కూడా రాజకీయ ఒత్తిళ్ళు, వారి పార్టీల రాజకీయ ప్రయోజనాలను విస్మరించలేరు కనుక అన్ని సమస్యలను పరిష్కరించగలరని ఆశించడం అత్యాశే అవుతుంది.