కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఎమ్మెల్యేలను కూడా కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చేవారు కారు. కానీ ఇప్పుడు జిల్లా స్థాయి నేతలతో కూడా భేటీ అవుతున్నారు. రోజుకి రెండు నియోజకవర్గాల చొప్పున పార్టీ కార్యకర్తలను కూడా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కి పిలిపించుకొని వారితో కూడా మాట్లాడుతున్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈవిదంగా అందరిని కలిసి ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి తెలిసి ఉండేది. ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండేది. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు కూడా. కానీ అప్పుడు అహంకారంతో అందరినీ దూరం చేసుకొని ఇప్పుడు కార్యకర్తలతో కూడా సమావేశమవుతూ, మళ్ళీ తాను అధికారంలోకి వచ్చేందుకు అందరూ కష్టపడి పనిచేయాలని కోరుతున్నారు.
కేసీఆర్ నేటికీ తన ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. కనీసం ఓటమికి కారణాలు తెలుసుకొని లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేసే బదులు పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత కష్టపడి పనిచేయాలని హితవు పలుకుతున్నారు.
రెండున్నర దశాబ్ధాల పాటు తెలంగాణ రాజకీయాలను శాశించిన తమ పార్టీ వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోయిందని ఆత్మవిమర్శ చేసుకునే బదులు, కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవడం వలననే ఓడిపోయామని, అయినా ఈ ఓటమిని తమ పార్టీకి దిష్టితీసిన్నట్లుగానే పరిగణించాలని కేసీఆర్ తన పార్టీ కార్యకర్తలకు చెపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిన్న మేడ్చల్, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల కార్యకర్తలతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇప్పటికే ప్రజలు బాధ పడుతున్నారని, కనుక మళ్ళీ వెతుక్కుంటూ మన దగ్గరకే వస్తారన్నారు. అంతవరకు ఓపిక పట్టి ప్రజా సమస్యలపై పోరాడాలని కేసీఆర్ వారికి సూచించారు.
పార్టీ అపజయాలను చూసి నిరాశ చెందకుండా, తెలంగాణ ప్రజలు తమతోనే ఉన్నారని బిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ గుర్తుంచుకొని ముందుకు సాగాలని కేసీఆర్ సూచించారు.
మరో నాలుగున్నరేళ్ళ వరకు రాష్ట్రంలో ఎన్నికలు జరుగవని కేసీఆర్‌కి తెలిసి ఉన్నా, త్వరలో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని నమ్మబలుకుతున్నారు. అది ఏవిదంగా సాధ్యమో కూడా కేసీఆర్ చెపితే పార్టీ నేతలకు, కార్యకర్తలకు నమ్మకం కలుగుతుంది కదా?