పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనతో పూర్తిస్థాయి రాజకీయనాయకుడుగా మారగా ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయి ప్రజాప్రతినిధిగా మారారు.
మరి ఆయన మొదలుపెట్టిన ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ సినిమాల సంగతి ఏమిటి?వాటిని ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారు? కొత్త సినిమా ఎప్పుడు మొదలుపెడతారు?అసలు ఇకపై సినిమాలు చేస్తారా లేదా?అని పవన్ కళ్యాణ్ అభిమానులలోనే కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులందరి ప్రశ్న.
ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్వయంగా జవాబు చెప్పారు. బుధవారం సాయంత్రం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించినప్పుడు అభిమానులు అడిగిన ఈ ప్రశ్నలకు జవాబు చెపుతూ, “మరో మూడు నెలల పాటు సినిమా షూటింగ్‌లలో పాల్గొనే అవకాశం లేదు. మీరు నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగిస్తే అది చేయకుండా వెళ్ళి సినిమా షూటింగ్‌లు చేసుకుంటానంటే మీరు ఊరుకుంటారా?
అయినా ఇప్పుడు సినిమాలు చేసేంత టైమ్ నాకు ఎక్కడుంది?ఇదివరకు జగన్ ప్రభుత్వం రోడ్ల గుంతలు కూడా పూడ్పించలేకపోయిందని మనమే విమర్శించాము కదా?వాటిని పూడ్పించకుండా నేను సినిమాలు చేసుకుంటుంటే ‘ఓజీ... క్యాజీ?’ అని మీరు కూడా నన్ను నిలదీయకుండా ఉంటారా?
అందుకే ముందు పరిపాలన, ప్రజాసేవా ఆ తర్వాతే సినిమాలు. మద్యలో ఎప్పుడైనా రెండు మూడు రోజులు ఖాళీ దొరికితే మొదలుపెట్టిన మూడు సినిమాలు పూర్తి చేస్తుంటాను. ఈవిషయంలో దర్శక, నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నందుకు వారికి ఫోన్ చేసి నా పరిస్థితి వివరించి చెప్పాను. వారు కూడా సహృదయంతో అర్దం చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టడం లేదు,” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
మొదలుపెట్టిన మూడు సినిమాలే పవన్ కళ్యాణ్ పూర్తి చేయలేనప్పుడు కొత్త సినిమాలు మొదలుపెట్టే అవకాశమే లేదని స్పష్టం అవుతోంది. ఒకవేళ ఆయన సిద్దపడినా ఈవిదంగా షూటింగ్ ఆలస్యమవుతుందని తెలిసి తెలిసి ఏ నిర్మాత ఆయనతో సినిమాలు మొదలుపెట్టే ఆలోచన చేయరు కూడా. కనుక ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేసిన్నట్లే భావించవచ్చు.