ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న తర్వాత తెలంగాణలో బీజేపీతో కలిపి పనిచేస్తామని చెప్పారు.
ఈ ప్రతిపాదనపై కేంద్ర సహాయమంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ స్పందిస్తూ, “పవన్ కళ్యాణ్ మంచి ప్రతిపాదనే చేశారు. కానీ దీనిపై మేము ఎవరికి వారు మా సొంత అభిప్రాయాలు చెప్పడం సరికాదు. పార్టీలో చర్చించుకున్నాక మా అభిప్రాయాలను మా అధిష్టానానికి తెలియజేస్తాము. అప్పుడు మా అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుంది,” అని చెప్పారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికలలో బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా, జనసేన పోటీ చేసిన 8 సీట్లలో ఓడిపోయింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ పొత్తుల గురించి రెండు పార్టీలు కనీసం ఆలోచించలేదు కూడా.
బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. కనుక జనసేన అవసరం బీజేపీకి లేదనే అర్దమవుతోంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రా మూలాలు, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండటం వలన, జనసేనతో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ రాజేయకుండా ఉండరు. దాని వలన బీజేపీ నష్టపోతుంది తప్ప తెలంగాణలో ఒక్క కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ కూడా జనసేన కాదు. బహుశః అందుకే బండి సంజయ్ ఈవిదంగా స్పందించి ఉండవచ్చు.