ఇంతకాలం తెలంగాణ సిఎంగా ఉన్న కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ మొదలు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వరకు అందరితో గొడవలు పెట్టుకునేవారు. చివరికి త్రిదండి చిన్న జీయర్ స్వామితో కూడా విభేదించి దూరం పెట్టేశారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని అనుకున్నప్పుడు దేశంలోని అన్ని పార్టీలను కలుపుకుపోవాలి. ఆ దిశలో ప్రయత్నించారు కూడా. కానీ పట్టుమని 10 ఎంపీ సీట్లు కూడా లేని తన నాయకత్వాన్ని అందరూ అంగీకరిస్తారని అనుకుని కేసీఆర్ భంగపడ్డారు.
దేశంలో కాంగ్రెస్, బీజేపీల బలాన్ని సరిగ్గా అంచనా వేయలేక వాటిని శత్రువులుగా మార్చుకొని, వాటి మిత్రపక్షాలను కూడా దూరం చేసుకొని దేశ రాజకీయాలలో కేసీఆర్ ఏకాకిగా మిగిలిపోయారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, చివరికి సొంత రాష్ట్రంలోనే గెలవలేక చతికిలపడ్డారు.
కానీ సిఎం రేవంత్ రెడ్డి పార్టీలో తనను వ్యతిరేకించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటివారిని కూడా కలుపుకుపోతూ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అటు ప్రధాని నరేంద్రమోడీతో సఖ్యతగా ఉంటూనే, ఇటు కాంగ్రెస్ అధిష్టానంతో కూడా విధేయంగా ఉంటూ పార్టీలో, ప్రభుత్వ పరంగా అన్ని పనులు చక్కపెట్టుకుంటున్నారు.
కేసీఆర్ సిఫార్సు చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో నామినేట్ చేసేందుకు తిరస్కరించిన మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, రేవంత్ రెడ్డి సిఫార్సు చేసిన ఇద్దరినీ వెంటనే నామినేట్ చేయడమే ఇందుకు ఓ నిదర్శనం.
కేసీఆర్, జగన్ ముఖ్యమంత్రులుగా, అంతకు మించి మంచి మిత్రులుగా ఉన్నప్పుడు కూడా విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించలేదు. కానీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ మొట్ట మొదట ఈ సమస్యల పరిష్కారానికి పూనుకుంటున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి గవర్నర్ సీపి రాధాకృష్ణన్‌తో కూడా సత్సంబంధాలు నెలకొల్పుకొని ఆయన కూడా తన ప్రభుత్వానికి తోడ్పడేలా జాగ్రత్తపడుతున్నారు. నిన్న గవర్నర్‌తో భేటీ అయినప్పుడు మళ్ళీ గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నామినేట్ చేయడం గురించి మాట్లాడి ఒప్పించిన్నట్లు సమాచారం.
త్వరలో మంత్రివర్గ విస్తరణ కూడా చేయబోతున్నందున ఆ విషయం కూడా ముందుగా గవర్నర్ సీపి రాధాకృష్ణన్‌కు తెలియజేయడం ద్వారా తనపట్ల ఆయనకు మంచి అభిప్రాయం కలిగేలా చేసుకున్నారని చెప్పవచ్చు.
ఈవిదంగా సిఎం రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుపోతూ పనులు చక్కటేబెట్టుకుంటుంటే, కేసీఆర్ అందరితో గొడవలు పడుతూ అందరినీ శత్రువులుగా మార్చేసుకొని తాను నష్టపోయారు. తన పార్టీని, ప్రభుత్వాన్ని కూడా కేసీఆరే నష్ట పరుచుకున్నారని చెప్పక తప్పదు.