హైదరాబాద్ మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేడు లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వివాదాస్పద నినాదాలు చేశారు. జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ అని నినాదాలు చేసిన తర్వాత జై పాలస్తీనా అని నినాదం చేయడంతో సభలో అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే అధికార ఎన్డీయే పక్ష సభ్యులు లేచి తీవ్ర అభ్యంతరం చెప్పారు. భారత పార్లమెంటులో వేరే దేశానికి అనుకూలంగా నినాదం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. దీంతో స్పీకర్ స్పందిస్తూ అభ్యతరకరమైన పదాలను రికార్డులలో నుంచి తొలగిస్తామని చెప్పడంతో వివాదం సద్దు మణిగింది.
లోక్‌సభ రికార్డులలో నుంచి వాటిని తొలగించగలరేమో కానీ అసదుద్దీన్ ఓవైసీ మనసులో ఉన్న అటువంటి ఆలోచనలను ఎవరూ తొలగించలేరు కదా?గతంలో కూడా ఆయన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. వాటన్నిటినీ పక్కన పెట్టినా, భారత రాజ్యాంగాన్ని, లోక్‌సభని గౌరవిస్తానని, వాటికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసి, వెంటనే అందుకు విరుద్దంగా ఈవిదంగా నినాదం చేయడాన్ని ఎవరూ సమర్ధించలేరు.