తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ను రద్దు చేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హైకోర్టులో నేడు పిటిషన్ వేశారు. ఛత్తీస్ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలలో భారీగా అవకతవకలు, లోపాలు జరిగాయని వాటి వలన తెలంగాణ ప్రభుత్వానికి వేలకోట్ల నష్టం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
కనుక వీటిపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ కేసీఆర్కు నోటీస్ పంపి వచ్చి వివరణ ఇవ్వాలని కోరగా, ఆయన 12 పేజీల లేఖని జవాబుగా పంపారు. ఆ లేఖలో చేసిన వాదనలనే హైకోర్టు పిటిషన్లో కూడా చేర్చి ప్రతివాదులుగా జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్, ఇంధనశాఖని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈ మూడు పనులు పూర్తి పారదర్శకంగా, నియమ నిబంధనల ప్రకారమే అప్పటి అవసరాల మేరకు తీసుకున్నందున జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ ఏర్పాటు అవసరమే లేదు. కనుక దానిని రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్లో కోరారు.
కేసీఆర్ ఈ వ్యవహారాన్ని హైకోర్టుకి తీసుకువెళ్ళడం ద్వారా, ముందుగానే జాగ్రత్తపడిన్నట్లు భావించవచ్చు. ఇప్పటివరకు జరిగిన కమీషన్ విచారణలో ఈ మూడు పనులలో కేసీఆర్ ప్రదర్శించిన తొందరపాటు వలన అడుగడుగునా లోపాలు, నష్టాలే ఉన్నాయని విధ్యుత్ శాఖల ఉన్నతాధికారులే చెపుతున్నారు.
పైగా ఛత్తీస్ఘడ్ ప్రభుత్వానికి ఇంకా తెలంగాణ ప్రభుత్వం రూ.1,080 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దానిపై కూడా రెండు ప్రభుత్వాల మద్య మరో వివాదం ట్రిబ్యూనల్లో నడుస్తోంది.
కాలం చెల్లిన టెక్నాలజీతో నిర్మించిన యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్స్ ప్రభుత్వానికి భారంగా మారాయని చెపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పదేపదే హెచ్చరించినా కేసీఆర్ వినకుండా పాత మోడల్ ప్లాంట్స్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, కానీ వాటిలో నేటికీ యాదాద్రి పనులు పూర్తికాలేదని చెప్పారు. కనుక ఇవన్నీ కేసీఆర్ మెడకే చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కనుక ముందుగానే జాగ్రత్త పడుతూ, కమీషన్ ఉనికినే సవాలు చేస్తూ రద్దు చేయాలని పిటిషన్ వేసిన్నట్లు భావించవచ్చు. కేసీఆర్ కోరుకున్నట్లు తీర్పు రాకపోయినా ఈ వివాదాన్ని న్యాయవివాదంగా మార్చినందున, ఈ కేసు ఎప్పటికీ ముగియకుండా కొనసాగుతూనే ఉంటుంది. కనుక జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ కేసీఆర్ని దోషిగా నిర్ధారించినప్పటికీ, కేసీఆర్ ముందుగానే హైకోర్టులో కేసు వేశారు కనుక ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.