ఢిల్లీలో మహిపాల్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరేందుకేనా?

June 25, 2024


img

అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న పటాన్‌చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీలో వాలిపోయారు. ఈ నెల 20న ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి, బినామీ పేర్లతో అక్రమ మైనింగ్ చేసి సుమారు రూ.300 కోట్లు అక్రమాస్తులు కూడబెట్టారని ప్రకటించారు. అంతేకాక మైనింగ్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.39.08 కోట్లు ఎగవేశారని ఈడీ ప్రకటించింది.

కనుక ఈ కేసుల నుంచి ఉపశమనం లభించాలంటే కాంగ్రెస్‌ లేదా బీజేపీలలో ఏదో ఓ పార్టీలో చేరిపోవాల్సి ఉంటుంది. 

ఆయన నివాసంపై ఈడీ దాడులు చేసింది కనుక వాటి నుంచి ఉపశమనం కోసం బీజేపీలో చేరుతారనుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నట్లు సమాచారం. 

ఆయన సోదరుడు మధుసూధన్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్‌ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిఎం రేవంత్‌ రెడ్డి కూడా అక్కడే ఢిల్లీలోనే ఉన్నారు. కనుక ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకే మహిపాల్ రెడ్డి హడావుడిగా ఢిల్లీ చేరుకొని ఉండవచ్చు. ఇదే నిజమైతే బిఆర్ఎస్ పార్టీలో మరో వికెట్ పడుతుంది. 

కానీ అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు ఇంత సులువుగా వాటి నుంచి తప్పించుకోగలుగుతుంటే, అటువంటివారిని పార్టీలో చేర్చుకోవడం ఇంకా పెద్ద తప్పు కాదా?


Related Post