ఢిల్లీకి సిఎం రేవంత్‌ రెడ్డి... మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకేనా?

June 23, 2024


img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి సోమ, మంగళవారం రెండు రోజులపాటు ఢిల్లీలో మకాం వేసి, కాంగ్రెస్‌ అధిష్టానాన్ని, ప్రధాని నరేంద్రమోడీని కలువబోతున్నారు. త్వరలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నందున, ఎవరెవరిని తీసుకోవాలనే విషయమై అధిష్టానంతో చర్చించి పేర్లు ఖరారు చేయనున్నారు.

సిఎం రేవంత్‌ రెడ్డి వీలైతే ఆరుగురిని లేదా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 2వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారు. కనుక ఈ పర్యటన ప్రధానంగా దీని కోసమే అని భావించవచ్చు. 

ఇక ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు, సంక్షేమ పధకాల గురించి మాట్లాడబోతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌, బీజేపీలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీతో సిఎం రేవంత్‌ రెడ్డి సఖ్యతగా, విధేయంగానే ఉంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలకు చెరో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నందున, సిఎం రేవంత్‌ రెడ్డి-ప్రధాని నరేంద్రమోడీతో భేటీకి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రభావం ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత కనపడే అవకాశం ఉంటుంది. 


Related Post