తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఈటలా మరొకరా?

June 22, 2024


img

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో ఆయన స్థానంలో మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ పదవి కోసం ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు, డికె అరుణ, రాజాసింగ్ పోటీ పడుతున్నారు. 

వారిలో ఈటల రాజేందర్‌కు పార్టీని నడుపగల సామర్ధ్యం, కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలను ఢీకొని పోరాడగల నేర్పు రెండూ ఉన్నాయని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్న తనకు ఈ అవకాశం ఇవ్వాలని ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని ఎంపీ డీకే అరుణ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. 

రఘునందన్ రావుకి తమ రాజకీయ ప్రత్యర్ధులను ఎదుర్కోవడంలో నేర్పు ఉంది కానీ ఆయన పార్టీని నడిపించగలరో లేదో తెలీదు. డీకే అరుణకు మాజీ మంత్రిగా అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినందున దాని బలాబలాలు బాగా తెలుసు. కానీ ఆమె పార్టీని నడిపించగలరా? పార్టీలో అందరినీ కలుపుకుపోగలరా? ఆమె నాయకత్వాన్ని మిగిలినవారు అంగీకరిస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ పట్ల విధేయంగా ఉంటూ హిందుత్వ అజెండాతో ముందుకు సాగుతుంటారు. కానీ ఎన్నడూ హైదరాబాద్‌ దాటి ఇతర జిల్లాలకు వెళ్ళిన దాఖలాలు కనిపించవు. కనుక పార్టీలో అందరితో పరిచయాలు లేవు. కనుక విధేయత, హిందుత్వ అజెండా అనే రెండు లక్షణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకొని పార్టీ పగ్గాలు అప్పగించలేదు. ధర్మపురి అరవింద్ తాను కూడా ఈ రేసులో ఉన్నానని చెపుతున్నారు.

ప్రస్తుతం బీజేపీ అధిష్టానం దీనిపై లోతుగా చర్చిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.


Related Post