ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం మారగానే కేసీఆర్‌కి, బిఆర్ఎస్ పార్టీకి ఎలా కష్టాలు మొదలయ్యాయో, పొరుగు రాష్ట్రంలో జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా అలాగే కష్టాలు మొదలయ్యాయి. అయితే ఇందుకు జగన్ స్వయంకృతమే ప్రధాన కారణమని చెప్పవచ్చు.
ఆయన సిఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వారి పార్టీ నేతలని చాలా దారుణంగా అవమానించారు. పోలీస్ కేసులు పెట్టి వేధించారు. చివరికి చంద్రబాబుని జైల్లో కూడా పెట్టించారు.
కనుక ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ప్రతీకార చర్యలు మొదలయ్యాయి. ముందుగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో జలవనరుల శాఖకు చెందిన రెండేకరాల స్థలంలో వైసీపి కార్యాలయాన్ని శనివారం ఉదయం సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేశారు.
ఇదేవిదంగా విశాఖలో ఎండాడ అనే ప్రాంతంలో సుమారు రూ.120 కోట్లు విలువగల రెండు ఎకరాల స్థలంలో ఏడాదికి రూ.1,000 అద్దె చొప్పున 33 ఏళ్ళకు లీజు మీద తీసుకొని వైసీపి కార్యాలయాన్ని నిర్మించుకుంది. కానీ ఇంతకాలం దానికి అనుమతులు తీసుకోకుండా అశ్రద్ద వహించింది. ఇప్పుడు టిడిపి ప్రభుత్వం రాగానే వైసీపి నేతలు నిన్న హడావుడిగా రూ.17 లక్షల ఫీజు చెల్లించి జీవీఎంసీలో అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుమతుల కోసం ప్రయత్నించారు.
కానీ జనసేన కార్పొరేటర్ ఫిర్యాదుతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు జీవీఎంసీ అధికారులే వైసీపికి అనుమతి లేకుండా నిర్మించినందుకు ఆ భవనాన్ని ఎందుకు కూల్చివేయకుండదో తెలియజేయాలంటూ నోటీసులు పంపారు. కనుక ఇక నుంచి జగన్, వైసీపి నేతలకు ఊహించని కష్టాలు మొదలవుతాయి.
జగన్మోహన్ రెడ్డి నిన్న శాసనసభకు వచ్చి శాసన సభ్యుడుగా ప్రమాణస్వీకారం చేసి వెంటనే బయటకు వెళ్ళిపోయారు. ఈరోజు స్పీకర్ (అయ్యన్న పాత్రుడు) ఎన్నిక జరుగుతుంటే సభకు రాకుండా పులివెందుల వెళ్ళిపోయారు.
శాసనసభలో జగన్‌తో కలిపి మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా టిడిపి, జనసేన, బీజేపీలకు 164 మంది ఉన్నారు. కనుక వారు తనని అవమానిస్తారనే భయంతో జగన్ శాసనసభకు మొహం చాటేస్తున్నారు. ఇక్కడ కేసీఆర్ కూడా బహుశః అదే కారణం చేత శాసనసభ సమావేశాలకు వెళ్ళకుండా ఉండిపోతున్నారు.