ఇటీవల కొన్ని రోజులుగా టిజిఎస్‌ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించే విదంగా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. సామాన్య ప్రజలకు సేవలందిస్తున్న టిజిఎస్‌ఆర్టీసీని ద్వేషించడానికి బలమైన కారణం ఏమీ కనబడటం లేదు కానీ ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే టిజిఎస్‌ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.
తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ వీడియో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. టిజిఎస్‌ఆర్టీసీ సిటీ బస్సు వస్తుంటే ఓ యువకుడు తాపీగా నడుచుకుంటూ దానికి ఎదురువెళ్ళి రోడ్డుపై బోర్లా పడుకుంటాడు. బస్సు అతనిపై నుంచి వెళ్ళిపోగానే ఆ యువకుడు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు.
దీనిపై టిజిఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ”సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిటెడ్ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను #TGSRTC యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది,” అని ట్వీట్ చేశారు.