ఆందోళనలతో ఫిరాయింపులు ఆపతరమా?

June 21, 2024


img

శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడాన్నే ఇంకా జీర్ణించుకోలేకపోతున్న బిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాకుండా ఓడిపోవడం ఇంకా పెద్ద షాక్ అనే చెప్పాలి. 

శాసనసభ ఎన్నికలలో ఓటమితోనే పార్టీ నుంచి ఫిరాయింపులు మొదలైనప్పుడు రాబోయే ప్రమాదాన్ని బిఆర్ఎస్ అధిష్టానం పసిగట్టే ఉంటుంది. అందుకే అటువంటి ఆలోచనలు ఉన్న ఎమ్మెల్యేలను కేసీఆర్‌, కేటీఆర్‌ బుజ్జగించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు తప్ప కానీ బిఆర్ఎస్ పార్టీ ఓటమికి తమ ధోరణే కారణమని నేటికీ ఒప్పుకోవడం లేదు లేదా గ్రహించడం లేదు. 

అందుకే లోక్‌సభ ఎన్నికలకు ముందు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని, కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీలు అధికారంలోకి రావని అప్పుడు తానే చక్రం తిప్పుతానన్నట్లు కేసీఆర్‌ మాట్లాడారు. 

ఈ అహంభావమే తమ పార్టీని దెబ్బ తీసిందని కేసీఆర్‌ వంటి రాజకీయ నాయకుడు గ్రహించకుండా మాట్లాడారంటే నమ్మశఖ్యంగా లేదు. కనుక కేసీఆర్‌ దానిని ఓ అద్భుతమైన వ్యూహామనుకొని ఉండవచ్చు కానీ ప్రజలు దానిని అహంభావంగానే భావించి లోక్‌సభ ఎన్నికలలో కూడా మరోసారి ఓడించారు. 

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయని కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. 

ఆయన ఉద్దేశ్యంలో బహుశః రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూల్చివేసి తాను మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అనుకూలమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడుతాయని కావచ్చు. కానీ అందుకు భిన్నంగా బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఖాళీ అయిపోవడం మొదలైంది. 

ఇది ఊహించిన పరిణామమే కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడుతారని ఊహించకపోయి ఉండవచ్చు. కనుక ఆ కోపావేశాలతో ఆయన ఇంటి ముందు బాల్క సుమన్, కార్యకర్తలను నిరసనలు చేయమని పంపించి ఉండవచ్చు. 

కానీ పార్టీ ఎమ్మెల్యేలను వెళ్ళిపోకుండా కాపాడుకోలేనప్పుడు, వారి ఇళ్ళ ముందు ధర్నాలు చేస్తే ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళతాయి?అని కేసీఆర్‌ ఆలోచించారో లేదో కానీ స్వయంగా తన నిసహాయతని చాటింపు వేసుకున్నట్లయిందని చెప్పక తప్పదు. 

అయితే ఈ ఫిరాయింపులు మళ్ళీ ఆరంభమే తప్ప ముగింపు కావు. కనుక ఇంకా ఎంతమంది బయటకు వెళ్ళిపోతారో లెక్క చూసుకొని తదుపరి కార్యాచరణ గురించి ఆలోచిస్తే మంచిది. లేకుంటే ఇకపై ఎమ్మెల్యే పార్టీ వీడినపుడల్లా వారి ఇళ్ళ ముందు ఇలా ధర్నాలు చేసేందుకు పార్టీలో నేతలు కూడా మిగలరు.  


Related Post