పాపం కేసీఆర్‌, జగన్‌... ఇంతలోనే ఎంత మార్పు !

June 21, 2024


img

ఏపీ, తెలంగాణ మాజీ సిఎంలు జగన్, కేసీఆర్‌ ఇద్దరి పరిస్థితి, వారి పార్టీల పరిస్థితి ఒకే సమయంలో ఇంచుమించు ఒకే విధంగా మారడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇద్దరూ కూడా తమ మాటే శాసనం అన్నట్లు ఎదురు లేకుండా పాలించారు. కానీ వారిద్దరి ధోరణి వలననే శాసనసభ ఎన్నికలలో వారి పార్టీలు ఓడిపోయాయి. కానీ ఇద్దరూ నేటికీ తమ ఓటమిని ఒప్పుకోవడం లేదు. 

ఒకప్పుడు కేసీఆర్‌ కాంగ్రెస్‌, టిడిపిలను ఖాళీ చేసేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలు బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేస్తున్నాయి. నేడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో జేరిపోయారు. అయితే ఇది ఇక్కడితో ఆగేది కాదు. రాబోయే రోజుల్లో మరింతమంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. 

ఇదివరకు కేసీఆర్‌ దెబ్బకి టిడిపి చాలా బలహీనపడి దాదాపు అదృశ్యమైనప్పటికీ, శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని చావు దెబ్బతీయగలిగింది. 

కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమై కుమ్ములాడుకుంటున్నప్పటికీ, రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్‌ని గద్దె దించి అధికారంలోకి రాగలిగింది. రేవంత్‌ రెడ్డి శపధం చేసిన్నట్లు లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రానీయకుండా చేసి కేసీఆర్‌ మీద రాజకీయ ప్రతీకారం తీర్చుకున్నారు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేస్తున్నారు. 

ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతే కేసీఆర్‌ తన పార్టీని నిలబెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రాగలరా లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. 

అక్కడ ఏపీలో జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. ఈసారి ఎన్నికలలో 175కి 175 సీట్లు వస్తాయని ప్రగల్భాలు పలికితే ఆయనతో కలిపి మొత్తం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 

ఇదివరకు శాసనసభలో తన ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుని దారుణంగా అవమానిస్తుంటే పకపకమని నవ్విన జగన్మోహన్‌ రెడ్డి, ఈరోజు శాసనసభలో అడుగు పెట్టేందుకే భయపడ్డారు. శాసన సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తన పేరు కూడా సరిగ్గా ఉచ్చరించలేక పోయారంటే ఆయన ఎంత ఆందోళనతో ఉన్నారో అర్దం చేసుకోవచ్చు. తర్వాత శాసనసభలో ఉండకుండా వెంటనే తన ఛాంబర్‌కు వెళ్ళి అక్కడ కాసేపు తన ఎమ్మెల్యేలతో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయారు.  

శాసనసభకు వెళితే ఇప్పుడు టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానిస్తారు కనుక శాసనసభలో ‘మనకి పనిలేదని జనం వద్దకు వెల్ధామని’ జగన్ చెప్పేశారు. 

ఇక్కడ కేసీఆర్‌ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. శాసనసభ సమావేశాలకు వెళ్తే రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ మంత్రులు అవమానిస్తారనే భయంతో మొహం చాటేస్తున్నారు. దీంతో శాసనసభ సమావేశాలలో పాల్గొనాలని సిఎం రేవంత్‌ రెడ్డి తదితరులు పదేపదే కేసీఆర్‌ని సవాలు చేస్తున్నారు. 

తిరుగేలేదనుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు పార్టీల అధినేతలకు, వారి పార్టీలకు ఇటువంటి దుస్థితి కలగడానికి కారణాలు ఏమిటో ప్రజలందరికీ తెలుసు. కానీ వారిద్దరూ వాటిని కూడా ఒప్పుకోవడం లేదు. కనుక వారి ఆహానికి వారి పార్టీలు బలికాక తప్పక పోవచ్చు. 


Related Post