మాజీ మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నారంటూ గత వారం రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని ఆయన ఖండించినప్పటికీ నిప్పు లేనిదే పొగ రాదు కనుక అవి ఆగడం లేదు. కనుక నేడో రేపో ఆయన బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తారనుకుంటే, నేడు ఓ అనూహ్య పరిణామం జరిగింది.
సిఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఈరోజు ఉదయం శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళారు.
ఆయన సిఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తర్వాత సిఎం రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించిన్నట్లు సమాచారం. కానీ ఇంకా అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.
సిఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసేందుకు వచ్చారనే విషయం తెలుసుకున్న బాల్క సుమన్ మరికొందరు బిఆర్ఎస్ నేతలు కలిసి అక్కడకు చేరుకొని లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి అత్యంత విశ్వసనీయత కలిగిన సీనియర్ నాయకుడు బిఆర్ఎస్ పార్టీని వీడితే అది ఆ పార్టీకి చాలా పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. పైగా ఇది ఇక్కడితో ఆగకపోవచ్చు. ఆయన వెంట మరికొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవచ్చు.
తాజా సమాచారం: పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.