లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్‌లో గురువారం ఉదయం ఆయన బెయిల్ పిటిషన్‌పై వాదోపవాదాలు జరిగాయి. ఈడీ, అర్వింద్ కేజ్రీవాల్ న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి న్యాయ్ బిందు తీర్పుని రిజర్వులో ఉంచి లక్ష రూపాయల పూచీకత్తుపై అర్వింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు నిన్న సాయంత్రం ప్రకటించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న అర్వింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది కనుక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యి మూడు నెలలుగా తిహార్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా మళ్ళీ బెయిల్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.
ఈ కేసులో కల్వకుంట్ల కవితని ప్రశ్నించాల్సినదేదీ లేదని ఈడీ, సీబీఐకు ఢిల్లీ హైకోర్టుకు ఇదివరకే తెలిపాయి. కానీ విచారణ పూర్తయ్యే వరకు ఆమెకు బెయిల్ మంజూరు చేయకూడదని వాదిస్తున్నాయి.
కనుక కల్వకుంట్ల కవితకు ఇంకా ఎప్పటికి జైలు నుంచి విముక్తి లభిస్తుందో తెలీని పరిస్థితి నెలకొని ఉంది. బహుశః అందువల్లే ఆమె సోదరుడు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి ఆమెను జైల్లో కలిసి ధైర్యం చెప్పి వచ్ఛిన్నట్లున్నారు.