ఏపీ శాసనసభ ఎన్నికలలో అనేక అనూహ్య పరిణామాలు జరిగాయి. వాటిలో ముద్రగడ పద్మనాభం శపధం కూడా ఒకటి. కాపు సామాజిక నాయకుడుగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఆయన, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్‌తో విభేదించి జగన్‌తో చేతులు కలిపారు.
అంతటితో ఊరుకుంటే బాగుండేది కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని శపధం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిచి ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు.
కనుక ముద్రగడ పద్మనాభం తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చాలని కోరుతూ ఏపీ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఆయన జగన్‌తో చేతులు కలిపి తమ ఓటమిని కోరుకున్నందున, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన అభ్యర్ధన మేరకు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కారణంగా ఆయన మరోసారి అందరి దృష్టిలో పడ్డారు కానీ నవ్వులపాలవుతున్నారు. అంత అనుభవం, వయసు ఉన్న ఆయన జగన్ బుట్టలో ఎలా పడ్డారు? పడినా ఇంత తెలివితక్కువ శపధం ఎలా చేశారు? ఎంతో గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవలసిన ఈ వయసులో ఈ అవమానకర ముగింపు ఏమిటి? అని అందరూ అనుకోవడం సహజమే కదా?