కాంగ్రెస్‌ అధిష్టానానికి రేవంత్‌పై అసంతృప్తి మొదలైందా?

June 20, 2024


img

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకి 272 ఎంపీ సీట్లు అవసరం కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌-ఇండియా కూటమి అనూహ్యంగా 234 సీట్లు గెలుచుకుంది. మరో 40 సీట్లు గెలుచుకుని ఉంటే అధికారంలోకి రాగలిగేది. మెజార్టీకి కాస్త దూరంలో ఆగిపోవడంతో అధికారం చేజారిపోయింది.  

మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పేలవమైన తీరు వలననే కొన్ని సీట్లు కోల్పోయామని భావిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఈ ఏడు రాష్ట్రాలు, ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు తక్కువ సీట్లు వచ్చాయనే విషయం తెలుసుకునేందుకు రాష్ట్రాల వారీగా కమిటీలు వేసింది. 

వాటిలో తెలంగాణ రాష్ట్రానికి కమిటీ సభ్యులుగా పీజే కురియన్, రఖిబుల్ హుస్సేన్, పర్గాత్ సింగ్‌లను పంపిస్తోంది.   

గత ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్‌ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకోగా ఈసారి ఏకంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకుని సత్తా చాటుకుంది. మరో రెండు మూడు సీట్లు గెలుచుకునేదే కానీ బీజేపీ కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వలన అది కూడా 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. 

కనుక తెలంగాణ కాంగ్రెస్‌ను తప్పు పట్టడానికి లేదు. ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా కాంగ్రెస్‌ అధిష్టానానికి తప్పుగా అనిపించలేదు. కానీ 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ పేలవంగా వ్యవహరిస్తోందని భావిస్తూ కమిటీని పంపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

అంటే కాంగ్రెస్‌ అధిష్టానానికి కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయామనే అసంతృప్తా లేదా రేవంత్‌ రెడ్డిపై అప్పుడు అసంతృప్తి మొదలైందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  



Related Post