కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో గల బొగ్గు గనులను వేలం వేస్తోంది. ఇప్పటి వరకు 9 వేలం పాటలు నిర్వహించగా, 10వది రేపు (శుక్రవారం) హైదరాబాద్‌లో జరుగబోతోంది. సింగరేణి పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా వాటిలో ఒకటి.
సుమారు 12 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ గనిని వేలం వేయకుండా నేరుగా తమకు కేటాయించాలని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. కానీ నిబంధనల ప్రకారం సింగరేణి కూడా వేలంపాటలో పాల్గొని దక్కించుకోవలసిందే అని బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉన్నందున దానికి యధోచితంగా తోడ్పడుతామని హామీ ఇచ్చారు.
ఈ నేపధ్యంలో సింగరేణి సంస్థ సిఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకొని శ్రావణపల్లి బొగ్గు గని వేలంపాటలో పాల్గొనబోతోంది.
వేలంపాటలో బొగ్గు గనులు దక్కించుకున్న సంస్థ అది తవ్వితీసి అమ్మే బొగ్గు విలువలో 4% శాతం రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే వేలంపాటలో పాల్గొనే ప్రైవేట్ కంపెనీలు 20-30 శాతం రాయల్టీ చెల్లించేందుకు పోటీ పడుతున్నాయి. కనుక వాటితో సింగరేణి పోటీ పడాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీ రూపంలో భారీగా ఆదాయం వస్తుంది కనుకనే వేలంపాట నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.
కానీ మాజీ సిఎం కేసీఆర్ తన వారికి బొగ్గు గనులు కట్టబెట్టేందుకే సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందంటూ దుష్ప్రచారం చేసి వేలంపాటని అడ్డుకునేందుకు కుట్రలు చేశారని కిషన్ రెడ్డి అన్నారు.
బయ్యారంలో లభించే ఇనుప ఖనిజం నాణ్యమైనది కాదని మూడు నిపుణుల కమిటీలు చెప్పడం వలననే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉక్కు ఖర్మాగారం ఏర్పాటు చేయలేదన్నారు. ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసని, కానీ కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లెందుకే దానిని వాడుకుంటున్నారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్మించకపోతే తానే నిర్మిస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలికారు కానీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా ఎందుకు నిర్మించలేదంటే అది లాభసాటి కాదనే కదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా కేసీఆర్ నేటికీ డబుల్ గేమ్ ఆడుతూనే ఉన్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.