రోజుకి రూ.191 కోట్లు అప్పులు, వడ్డీలకేనట!

June 19, 2024


img

ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంతకాలం అధికారంలో ఉన్నవారు సామాన్య ప్రజలకు కళ్ళకు కట్టిన గంతలు తొలగిపోయి చేదు నిజాలు కళ్లెదుట కనిపిస్తుంటాయి.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 10 ఏళ్ళ పాటు సాగిన కేసీఆర్ పాలన స్వర్ణయుగంలా అనిపించేదంటే అతిశయోక్తి కాదు. 

ఓ వైపు ఎటు చూసినా అనేక సాగునీటి ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లు, రోడ్ల నిర్మాణాలు, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండేవి. మరోవైపు విజయవంతమైన అనేక సంక్షేమ పధకాలు అమలవుతుండేవి. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడుల వరద, ఎక్కడ చూసినా సాగునీరు, కోనసీమని తలపించేలా పచ్చటి పంటలు, కేంద్ర ప్రభుత్వం సైతం కొనలేనంత ధాన్యం ఉత్పత్తి, ఎటు చూసినా విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రం.

తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు మళ్ళీ పూర్వ వైభవం సాధించడం, వాటికి సముచిత ప్రాధాన్యం లభించడం అందరూ కళ్ళారా చూశారు.

వీటి కోసమే కదా... ఆనాడు అంత మంది బలిదానాలు చేసుకున్నారు... ఇటువంటి తెలంగాణా కోసమే కదా ఆనాడు అందరం కోట్లాడి సాధించుకున్నామని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ గర్వంగా చెప్పుకునేవారు. 

ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే... ఇప్పుడు రెండో వైపు చూడమంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీ, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, ఇంకా అభివృద్ధి పేరుతో చేసిన అప్పుల జాబితాలన్నిటినీ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతోంది.

వాటన్నిటినీ చూస్తున్న సామాన్య ప్రజలు షాక్ అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు గొర్రెల పంపిణీ వరకు దేనినీ బీఆర్ఎస్ నేతలు వదలకుండా దోచేసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చెపుతోంది. వాటిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించేందుకు పలు కమిటీలు, కమీషన్లు వేసి విచారణ జరిపిస్తోంది. 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా తెలంగాణ కాంగ్రెస్, తమ ప్రభుత్వం రోజుకి రూ.191 కోట్లు అప్పులు, వడ్డీలు చెల్లిస్తోందనే విషయం బయటపెట్టింది. ఈ లెక్కన గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు తమ ప్రభుత్వం మొత్తం రూ. 38,040 కోట్లు చెల్లించిందని తెలియజేసింది. కేసీఆర్ చేసిన ఆర్ధిక విధ్వంసానికి తమ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పడం లేదని పేర్కొంది. 


Related Post