కిషన్ రెడ్డి చేతికి మసి అంటక తప్పదా?

June 19, 2024


img

కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే దేశవ్యాప్తంగా తన ఆధీనంలోగల బొగ్గు గనులను వేలం వేయబోతోంది. వాటిలో సింగరేణి పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఒకటి. దీనిలో సుమారు 12 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి అంచనా వేసింది.

ఈసారి బొగ్గుశాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నందున ఈ గని వేలం లేకుండా నేరుగా తమకు కేటాయించాలని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. కానీ నిబంధనల ప్రకారం సింగరేణి కూడా వేలంపాటలో పాల్గొనవలసి ఉంటుంది.

ఇదివరకు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ కారణాలతో పంతానికి పోయి కోయగూడెం, సత్తుపల్లి-3 బొగ్గు గనుల వేలంపాటలో సింగరేణి పాల్గొనకుండా ఆపించేశారు. ఆ కారణంగా ఆ రెండు గనులను ప్రైవేట్ కంపెనీల చేతికి వెళ్ళిపోయాయి.

వాటిలో సుమారు 20 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి అంచనా వేసింది. ఇప్పుడు శ్రావణపల్లి గని కూడా ప్రైవేట్ కంపెనీ చేతికి వెళ్ళిపోతే భవిష్యత్‌ సింగరేణి చేతిలో ఉన్న గనులలో బొగ్గు తరిగిపోతే చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. 

కనుక ఈసారి వేలంపాట లేకుండా నేరుగా తమకు కేటాయించాలని సింగరేణి యాజమాన్యం కిషన్ రెడ్డిని అభ్యర్ధించింది. ఒకవేళ అలా కుదరకపోతే వేలంపాటలో పాల్గొనేందుకు అనుమతించాలని సిఎం రేవంత్‌ రెడ్డిని అభ్యర్ధించగా ఆయన సానుకూలంగా స్పందించారు. 

బొగ్గు గనులు ఏ సంస్థ దక్కించుకుంటే అది తవ్వితీసి అమ్మే బొగ్గు విలువలో 4శాతం రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకు సింగరేణికి ఇబ్బంది లేదు కానీ వేలంపాటలో పాల్గొనే ప్రైవేట్ కంపెనీలు 20-30 శాతం రాయల్టీ చెల్లించేందుకు పోటీ పడుతుంటాయి. వాటిలో ఏది ఎక్కువ చెల్లిస్తే దానికి ఆ గని దొరుకుతుంది.

కానీ సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి అంత రాయల్టీ చెల్లించాల్సివస్తే బొగ్గు ధర అమాంతం పెంచాల్సి ఉంటుంది. ఆ భారం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై పడితే అవి ఆ భారాన్ని విద్యుత్ పంపిణీ చేసే డిస్కంలకు బదిలీ చేస్తాయి. అప్పుడు అవి ఆ భారాన్ని సామాన్య ప్రజలకు బదిలీ చేస్తే విద్యుత్ చార్జీలు పెంచక తప్పదు.

కనుక వేలంపాట లేకుండా శ్రావణపల్లి బొగ్గు గనిని తమకు కేటాయించాలని సింగరేణి కోరుతోంది. కానీ ప్రైవేట్ కంపెనీలు 20-30 శాతం రాయల్టీ చెల్లించడానికి సిద్దపడుతున్నప్పుడు వేలంపాట లేకుండా ఆ గనిని సింగరేణికి అప్పగిస్తే అవి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కేంద్రానికి ఇబ్బంది కలుగుతుంది.

తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి తన రాష్ట్రానికి న్యాయం చేస్తారా లేదా తన శాఖకు న్యాయం చేస్తోయారో చూడాలి. ఈ వేలంపాటలో కిషన్ రెడ్డి చేతికి ఎంతో కొంత మసి అంటక తప్పదేమో?


Related Post