కేసీఆర్ అరెస్ట్ తప్పదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా?

June 18, 2024


img

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈరోజు ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి, “రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకు మాపై అవినీతి ఆరోపణలు చేసి కమీషన్, విచారణ పేరుతో బురద జల్లెందుకు ప్రయత్నిస్తోంది. కానీ నాలుగు కేసులలో ఏ ఒక్క దానిని నిరూపించలేకపోయింది. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనుక బీజేపీ పెద్దలున్నారని, వారే కేసీఆర్‌ని ఏదో ఓ కేసులో అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని భావిస్తున్నాము. కేంద్ర సహాయ మంత్రి పదవి చేపట్టినా బండి సంజయ్‌ ఇంకా మూర్ఖంగానే ప్రవర్తిస్తున్నారు. 

రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరూ కలిసే కుట్రలు చేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ ఎప్పుడూ కుమ్మక్కు అవుతూనే ఉన్నాయి. కనుక ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు మరోసారి కుమ్మక్కు అయితే ఆశ్చర్యపోము,” అని అన్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత చిక్కుకున్నప్పుడు ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసినప్పుడు, విచారణ చేసినప్పుడు కూడా బిఆర్ఎస్ నేతలు ఇదేవిదంగా ఆమె ఏ తప్పు చేయలేదని, ఆ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందిన్నట్లు ఏదీ, సీబీఐలు నిరూపించలేకపోయాయని వాదించేవారు. అదే నిజమైతే న్యాయస్థానాలు ఆమెను ఇన్ని రోజులు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉండనిచ్చేవా? 

ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులలో కూడా బిఆర్ఎస్ నేతలు ఇలాగే వాదిస్తున్నారు. కేసీఆర్‌ని అరెస్ట్ చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఇప్పుడు జగదీష్ రెడ్డి ముందే చెప్పుతున్నారు. కనుక ఏదో ఓ కేసులో కేసీఆర్‌ అరెస్ట్ తప్పదని బిఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తోందని అనుకోవాలేమో?


Related Post