బిఆర్ఎస్ నేతల ప్రత్యేకత ఏమిటంటే వారు మాట్లాడిన మాటలు, చేసిన తప్పులు, ఇచ్చిన హామీల గురించి మరిచిపోయి ఎదుట వాళ్ళని నిందిస్తుంటారు.
ఉదాహరణకు పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినా నిరుద్యోగ భృతి, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, అమలు చేయకుండా వెళ్ళిపోయారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే ఎన్నికల హామీలను ఇంకా ఎప్పుడు అమలుచేస్తారని బిఆర్ఎస్ నేతలు నిలదీస్తుండటం విశేషం.
అలాగే కేటీర్ స్వయంగా లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోతారని పదేపదే చెప్పేవారు. రేవంత్ రెడ్డి ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి బీజేపీలో చేరిపోతారంటూ కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నప్పుడు హరీష్ రావుకి తప్పుగా అనిపించలేదా? అనే సందేహం కలుగుతుంది.
అంతకు ముందు ఉప ఎన్నికలలో సరిగ్గా పోలింగ్ ముందు కాంగ్రెస్ అభ్యర్ధులు ఎన్నికల తర్వాత పార్టీ మారిపోతారంటూ బిఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేసేది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచినవారు బిఆర్ఎస్‌లో చేరిపోయేవారు కనుక ఈ దుష్ప్రచారం కాంగ్రెస్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.
ప్రధాని నరేంద్రమోడీ మొదలు దేశంలో తమకు నచ్చని ప్రతీ నాయకుడిని కేసీఆర్ చాలా దారుణంగా ఎద్దేవా చేసేవారు. నేటికీ చేస్తుంటారు కూడా. జస్టిస్ నరసింహా రెడ్డిని కమీషన్ బాధ్యత చేపట్టడానికి అనర్హుడు, ఆ పదవి నుంచి తప్పుకోవాలంటూ కేసీఆర్ వ్రాసిన తాజా లేఖే ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
బిఆర్ఎస్ పార్టీ ఈవిదంగా ప్రవర్తిస్తూ తమ గురించి ఎవరూ తప్పుగా వ్రాయకూడదని, మాట్లాడకూడదని హరీష్ రావు కోరుకోవడం, బెదిరించడం చాలా హాస్యస్పదంగా ఉంది కదా?