శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, పార్టీ నుంచి పలువురు సీనియర్ నేతలు కేసీఆర్ ధోరణిని తప్పు పడుతూ వెళ్ళిపోవడంతో కేసీఆర్ ప్రతిష్ట మసక బారింది.
ఈ నేపధ్యంలో ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావుకు పార్టీ అధ్యక్షుడుగా నియమించి పార్టీ పగ్గాలను అప్పగించాలని ఆలోచనలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్యనేతలు, మేధావులతో కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
బిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో రాజకీయంగా ముందుకు సాగుతూ మళ్ళీ ప్రజాధరణ పొందాలంటే కేటీఆర్ కంటే హరీష్ రావు మేలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించి, కేసీఆర్ తాను గౌరవాధ్యక్షుడుగా కొనసాగాలనుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ హరీష్ రావు కాకపోతే దళిత నాయకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రవీణ్ కుమార్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే కేసీఆర్ నిజంగానే పార్టీ పగ్గాలను వేరే వారికి అప్పగించాలని అనుకుంటున్నారా లేదా తానే అధ్యక్షుడుగా కొనసాగాలని పార్టీలో అందరిచేత అనిపించుకోవడానికే ఈ ఆలోచన చేస్తున్నారా? అసలు కేసీఆర్ ఈ ఆలోచన చేస్తున్నారా లేదా?అనే దానిపై బహుశః త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.