జస్టిస్ నరసింహారెడ్డి కమీషన్ ఎలా స్పందిస్తుందో?

June 16, 2024


img

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలకు టెండర్లు పిలవకుండా బి‌హెచ్‌ఈ‌ఎల్‌కు ఏకపక్షంగా కట్టబెట్టడంపై విచారణ కొరకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమీషన్ చేసింది. ఈ రెండు అంశాలపై  వివరణ ఇవ్వాలని కోరుతూ కేసీఆర్‌కు కమీషన్‌ నోటీస్ పంపింది. దానికి ఆయన 12 పేజీలతో చాలా ఘాటుగా లేఖతో బదులిచ్చారు. 

తెలంగాణ ఏర్పడినప్పటికి రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం, ఇంకా పలు సాంకేతిక, చట్టపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయాలు తీసుకున్నామని ఆ లేఖలో తెలియజేస్తూనే, తన నిర్ణయాలను కేసీఆర్‌ గట్టిగా సమర్ధించుకున్నారు. 

అంతేకాదు... నిష్పక్షపాతంగా విచారణ జరపకుండా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కోరిన్నట్లుగా తనను దోషిగా నిర్ధారించేందుకు కమీషన్ సిద్దపడిందని, అసలు ఈ కమీషన్‌ ఏర్పాటే తప్పని, మీరు (జస్టిస్ నరసింహారెడ్డి) కూడా కమీషన్ విచారణాధికారిగా అర్హత కోల్పోయారని కనుక తక్షణమే కమీషన్ నుంచి తప్పుకోవాలని కేసీఆర్‌ తన లేఖలో పలుమార్లు డిమాండ్ చేశారు. 

బహుశః కేసీఆర్‌ నుంచి ఇలాంటి లేఖ వస్తుందని జస్టిస్ నరసింహారెడ్డి కమీషన్ ఊహించి ఉండకపోవచ్చు. కనుక జస్టిస్ నరసింహారెడ్డికి ఇది చాలా పెద్ద షాకే అనే భావించవచ్చు. 

ఈ దశలో జస్టిస్ నరసింహారెడ్డి కమీషన్ కేసీఆర్‌ వాదనలను అంగీకరించలేదు. అలాగని పూర్తిగా కొట్టిపడేయలేదు. అంగీకరిస్తే కమీషన్ పరువు, దానిని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పరువు కూడా పోతుంది. 

కొట్టిపడేసి కేసీఆర్‌ మీద చర్యలు తీసుకోవాలంటే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ నూటికి నూరు శాతం తప్పని, వాటి వలన తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిందని నిరూపించి చూపాల్సి ఉంటుంది. కనుక దీనిపై జస్టిస్ నరసింహారెడ్డి కమీషన్ ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి. 


Related Post