త్వరలో కల్వకుంట్ల కవితకు బెయిల్?

June 14, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో గత మూడు నెలలుగా తిహార్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉండిపోయిన బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఆమె సోదరుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం ఉదయం పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ములాఖాత్ సమయంలో కేటీఆర్‌ ఆమెను కలుసుకొని ధైర్యం చెప్పి వచ్చారు. 

ఆమెను మార్చి 15వ తేదీన సీబీఐ అధికారులు హైదరాబాద్‌లో ఆమె నివాసం నుంచి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉంటూ బెయిల్‌ కోసం విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ సీబీఐ, ఈడీ ఆమెపై తీవ్రమైన సెక్షన్స్ కింద ఛార్జ్-షీట్‌ నమోదు చేయడంతో న్యాయస్థానాలు ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడం లేదు. కనుక మూడు నెలలుగా తిహార్ జైల్లోనే ఉంటున్నారు. 

ఈ కేసుతో తెలంగాణలో బీజేపీ-బిఆర్ఎస్‌, ఢిల్లీలో ఆమాద్మీ-బీజేపీ రాజకీయాలు కూడా ముడిపడి ఉన్నందున ఆ ప్రభావం కూడా ఉంటుంది.

లోక్‌సభ ఎన్నికలు పూర్తయిపోయాయి. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడం కోసం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పార్టీని బలిదానం చేశారని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపణలు నిజమే అయితే ఆ బలిదానానికి బదులుగా త్వరలోనే కల్వకుంట్ల కవితకు బెయిల్‌ లభించే అవకాశం ఉంటుంది.


Related Post