పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఏపీలో టిడిపి, జనసేన, బీజేపీ మూడు పార్టీల పొత్తులు కుదర్చడంలో, అదే విదంగా ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో టిడిపి కూటమి ఘన విజయం సాధించడంలోను పవన్ కళ్యాణ్ చాలా కీలకపాత్ర పోషించారు.
తెలంగాణలో జనసేన పోటీ చేసిన 8 సీట్లలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది కానీ ఏపీలో పోటీ చేసిన 22 శాసనసభ, 2 లోక్‌సభ సీట్లను గెలుచుకొని కూటమి ప్రభుత్వంలో కూడా ప్రధాన భాగస్వామిగా నిలిచింది.
కనుక పవన్ కళ్యాణ్‌కి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతికత శాఖలు కూడా లభించాయి.
జనసేనకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు కూడా మంత్రి పదవులు లభించాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, వగైరా కొన్ని శాఖలను అట్టేబెట్టుకున్నారు.
తన కుమారుడు, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్‌కు విద్యాశాఖ, ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలు కేటాయించారు.
టిడిపి సీనియర్ మహిళా నేత వంగలపూడి అనితకు ఏపీ హోమ్ మంత్రి పదవి, మరో సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌కు ఆర్ధిక శాఖ బాధ్యతలు అప్పగించారు.