ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు, వాటి నేతలు వ్యవహరిస్తున్న తీరుని అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మర్నాటి నుంచి ప్రభుత్వం పడిపోతుందని, పడగొట్టేస్తామంటూ బిఆర్ఎస్ పార్టీ బెదిరింపులు మొదలుపెట్టగా, బీజేపీ కూడా దానికి వంతపాడుతోంది.
అదేవిదంగా ఏపీలో గత 5 ఏళ్ళుగా టిడిపి, జనసేనలను జగన్ ప్రభుత్వం వేటాడి వేధించింది. చంద్రబాబు నాయుడుని జైలుకి పంపించి వైసీపి నేతలు టపాసులు కాల్చి, మిటాయిలు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. వాటన్నిటినీ అధిగమించి చంద్రబాబు నాయుడు నిన్న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించబోతే జగన్ ఫోన్ ఎత్తలేదు.
నిన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మఝీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ని కూడా ఆహ్వానించగా ఆయన ఏమాత్రం సంకోచించకుండా వచ్చి తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న మోహన్ చరణ్ మఝీని ఆశీర్వదించారు.
అంతకు ముందు మోహన్ చరణ్ మఝీ నవీన్ పట్నాయక్ నివాసానికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుని తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించారు.
ఒడిశా శాసనసభ ఎన్నికలలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం, పాలన, ఆయన పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్రనేతలు కూడా ఆయన రాగానే లేచి నిలబడి సాదరంగా ఆహ్వానించారు. ఆయన కుర్చీలో కూర్చున్న తర్వాతే అందరూ కూర్చున్నారు. ఇంత సంస్కారవంతమైన రాజకీయాలు ఎన్నడైనా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో చూడగలమా?
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/s2qFJN8UJB8?si=xJbRPxya2NI2hg0e" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>