హిల్లరీ, ట్రంప్ ఎవరు గెలిస్తే ఏమిటి?

November 07, 2016


img

మరికొన్ని గంటలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలవబోతున్నాయి. ఈసారి ఎన్నికలలో అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఇద్దరూ కూడా ఇంచుమించు సరిసమానంగానే ముందుకు సాగుతున్నారు. ఇద్దరిలో హిల్లరీ క్లింటన్ కొద్దిగా ఆధిక్యతలో ఉన్నాట్లు తాజా సమాచారం. కానీ రేపటి ఎన్నికలలో కూడా ఆమె తన ఆధిక్యత నిలబెట్టుకొంటారో లేదో చూడాలి. వారిరువురిలో ఎవరు గెలిస్తే అమెరికా మరియు ప్రపంచదేశాలపై ఎటువంటి ప్రభావం ఉంటుందో కొంతవరకు ఊహించవచ్చు. 

హిల్లరీ క్లింటన్ ఆధిక్యత ప్రదర్శించినప్పుడు అమెరికా మరియు ప్రపంచ మార్కెట్లు కొంత మెరుగుపడటం గమనిస్తే, ప్రపంచ వ్యాప్తంగా హిల్లరీ పట్ల కొంత సానుకూలత ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అందుకు ప్రధానకారణం అందరికీ తెలుసు. ట్రంప్ తో పోలిస్తే ఆమె విధానాలు చాలా ఉదారంగా లేదా వాస్తవికతకి దగ్గరలో ఉన్నందునే అని చెప్పవచ్చు. ఆమె అమెరికా అధ్యక్షురాలైనట్లయితే, ప్రస్తుతం ఒబామా కొనసాగిస్తున్న విధివిధానాలే యధాతధంగా కొనసాగించే అవకాశాలే ఎక్కువ. కనుక దేశంలో స్థిరపడిన విదేశీయులు, అమెరికాకి ఐటి తదితర రంగాలలో సేవలు అందిస్తున్న విదేశీ సంస్థలకి ఆమె వలన కొత్తగా ఎటువంటి ఇబ్బందులు రాకపోవచ్చు. కానీ అమెరికా ఆర్ధికంగా మరింత బలపడేందుకు ఆమె ట్రంప్ లాగ నిర్దిష్టమయిన చర్యలు ఏవీ ప్రకటించలేదు. కనుక ఆమె పాలనలో అమెరికా ఆర్ధికవ్యవస్థ కొంత బలహీనపడవచ్చు లేదా యధాతధ పరిస్థితులలోనే ఉండిపోవచ్చు.

గతంలో ఆమెకి విదేశాంగ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నందున, ప్రస్తుత పరిస్థితులకి అనుకూలంగా చక్కటి విదేశాంగ విధానాలు అమలుచేయవచ్చు. ఆమె ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి మహిళలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెపుతున్నారు కనుక వారికి మేలు కలిగే కొన్ని చర్యలు చేపట్టవచ్చు. ఉగ్రవాదాన్ని నివారించడం కోసం ఆమె ఒబామా అనుసరిస్తున్న విధానాలనే కొనసాగించవచ్చు. కనుక ఆమె విజయం సాధిస్తే పాక్ నిశ్చింతగా ఉగ్రవాదులని పెంచి పోషించుకోవచ్చు.

ఒకవేళ ట్రంప్ ఈ ఎన్నికలలో విజయం సాధించి అధ్యక్షుడైనట్లయితే, ఆయన తన స్వభావసిద్దమైన దూకుడు ప్రదర్శిస్తూ అనేక కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగాలు, విదేశీ విధానం, ఉగ్రవాద నిర్మూలన ఈ మూడు అంశాలలో కళ్ళకి కనబడేంతగా స్పష్టమైన మార్పులు జరుగవచ్చు. అమెరికా ఉద్యోగాలని భారత్, చైనా తదితర దేశాలు దొంగిలించుకొని పోతున్నాయని వాటిని పూర్తిగా అరికడతానని ట్రంప్ నిన్న కూడా గట్టిగా చెప్పారు కనుక ఆయన దానికే ప్రాధాన్యత అదే ఉండవచ్చు. కనుక అమెరికాకి అవుట్ సోర్సింగ్ సేవలు అందిస్తున్న భారతీయ ఐటి సంస్థలు నష్టపోయే ప్రమాదం ఉండవచ్చు.

ట్రంప్ ఒక వ్యాపారవేత్త కనుక అమెరికా ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవచ్చు. దాని వలన భారత్, చైనా వంటి దేశాలు, కంపెనీలు, విదేశీ ఉద్యోగులు నష్టపోయినా, ఆయన ఖాతరు చేయకపోవచ్చు.  ఆయన అధ్యక్ష పదవి చేపడితే ఉగ్రవాదంపై పోరాటాల కోసం అమెరికా చేస్తున్న ఖర్చులో బారీకోత విధించవచ్చు. దాని వలన ఉగ్రవాదులు  మళ్ళీ బలపడవచ్చు. ఉగ్రవాదంపై పోరు కోసం అమెరికా ఏటా పాకిస్తాన్ కి కోట్లాది డాలర్లు అందిస్తోంది. దానిలో ఆయన కోత విధిస్తే పాక్ పరిస్థితి కూడా తారుమారు కావచ్చు. దానివలన పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఇంకా బలం పుంజుకోవచ్చు. అది భారత్ కి ఇంకా ఇబ్బందికర పరిస్థితి సృష్టించవచ్చు. 

తాజా సర్వేలలో ఇరువురికీ సమానంగా విజయావకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ రేపటి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయితే గానీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. 


Related Post