తెలంగాణ ఉద్యమాకారులపై కేసులు ఎత్తివేతకు సన్నాహాలు

December 09, 2023


img

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా వేగంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఈరోజు సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం మహాలక్ష్మీ ఉచిత బస్సు పదకాన్ని ప్రారంభించారు. అలాగే ఎన్నికలలో హామీ ఇచ్చిన్నట్లు ఆరోగ్యశ్రీ వైద్యసేవలకు ప్రభుత్వం చెల్లిస్తున్న సొమ్ముని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఉపశమనం కలిగించబోతున్నారు. 

నిజానికి కేసీఆర్‌ నేతృత్వంలోనే తెలంగాణ ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాత కేసీఆర్‌ 10 ఏళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించారు కూడా. అయినా నేటికీ అనేకమంది ఉద్యమకారులపై పోలీస్ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. బిఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు వాటి నుంచి బయటపడి, ఆ కేసులు తమకు గౌరవాన్ని ఇనుమడింపజేసే పతకాల వంటివని గొప్పగా చెప్పుకోవడం అందరూ వినే ఉంటారు. కానీ ఉద్యమాలలో పాల్గొన్న సామాన్య ప్రజలకు మాత్రం ఆ కేసులు శాపాలుగా మారాయి. 

నేటికీ వాటి కోసం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ మనోవేధన అనుభవిస్తూనే ఉన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్‌ సూచన మేరకు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండో రోజునే ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్‌ రెడ్డి డిజిపి రవి గుప్తాను ఆదేశించారు. దీంతో ఆయన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పోలీస్ అధికారులకు ఉద్యమకారులపై కేసుల వివరాలను పంపించాలని ఈరోజు ఆదేశించారు.     



Related Post