గత శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ చేతిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోగా, మునుగోడు ఉపఎన్నికలలో మళ్ళీ బిఆర్ఎస్ చేతిలోనే ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈసారి నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న వారిద్దరూ, ఈసారి ఎన్నికలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క సీటు కూడా బిఆర్ఎస్ పార్టీకి దక్కనీయమని, జిల్లాకు చెందిన ఏ ఒక్క బిఆర్ఎస్ అభ్యర్ధి అసెంబ్లీ గేటుని తాకనీయమని ప్రగల్భాలు పలుకుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
వారికి వారి సొంత పార్టీలోనే నేతల మద్దతు లేదు. వారిరువురూ కూడా నేటికీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మోసం చేసినందుకు ఇద్దరినీ స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు కూడా అసహ్యించుకొంటున్నారు. మునుగోడు అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఖరారు కాగానే స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలే ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
ఇక నల్గొండ,మునుగోడు నుంచి బిఆర్ఎస్ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ తమ తమ నియోజకవర్గాలపై పూర్తి పట్టు సాధించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాపై బిఆర్ఎస్ పార్టీ పూర్తి పట్టు సాధించేందుకు సిఎం కేసీఆర్ కూడా నియోజకవర్గాల అభివృద్ధికి విరివిగా నిధులు కేటాయిస్తుండటంతో ఇద్దరూ తమ నియోజకవర్గాలలో అనేక అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజలను మెప్పిస్తున్నారు.
అయితే కోమటిరెడ్డి సోదరులిద్దరూ ఈ 5 ఏళ్ళలో పదవుల కోసం కొట్లాటలు, రాజకీయాలు తప్ప మరేమీ చేయలేదని అందరికీ తెలుసు. కానీ ఈ ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి ఇద్దరూ గెలవాలనుకొంటున్నారని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ధీమాతోనే వారు ఈవిదంగా ప్రగల్భాలు పలుకుతుండవచ్చు. కానీ జిల్లా ప్రజలు అభివృద్ధి చూసి ఓట్లు వేస్తే వారికి పరాభవం తప్పకపోవచ్చు.