తెలంగాణ శాసనసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఈసీ స్పష్టం చేసింది. అంటే మరో వారం-పది రోజులలో ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. మరో రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి సమయంలో సిఎం కేసీఆర్ ఎల్లుండి (శుక్రవారం) మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఇదే చివరి సమావేశం కావచ్చు.
ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది కనుక కొత్తగా ఎటువంటి అభివృద్ధి పనులు, వరాలు ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పధకాలు ప్రకటించినందున, వాటికి ధీటుగా కొత్త పధకాలు ప్రకటించాల్సి ఉంటుంది. కనుక ఈ సమావేశలో వాటన్నిటి గురించి చర్చించి ఆమోదించవచ్చు.
త్వరలో ఎన్నికల ప్రచారసభలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు ఈడీ మళ్ళీ నోటీసులు పంపడం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేయకుండా తిరస్కరించడం వంటి అంశాలపై కూడా చర్చించి, వీటిని ఎన్నికల ప్రచారంలో రాజకీయ అస్త్రాలుగా ఏవిదంగా ఉపయోగించుకోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించవచ్చు.