సచివాలయం తరువాత ఎర్ర మంజిల్ వంతు

October 21, 2016


img

ముఖ్యమంత్రి కెసిఆర్ కి నిజాం ప్రభువులు చాలా గొప్పగా కనిపిస్తుంటారు కానీ వారు కట్టిన చారిత్రిక కట్టడాలు మాత్రం అంత గొప్పవిగా కానీపించకపోవడం విచిత్రమే. ఇదివరకు చారిత్రిక ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని, ఆ తరువాత ఎర్రగడ్డ ఆసుపత్రి పక్కన గల చారిత్రిక కట్టడాన్ని కూల్చివేద్దామనుకొన్నారు కానీ ప్రజలు, ప్రతిపక్షాలు గట్టిగా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ ఆలోచన విరమించుకొన్నారు. 

తాజాగా సచివాలయ భవనాన్ని, ఎర్ర మంజిల్ ప్యాలస్ ని కూల్చివేయాలని నిర్ణయించుకొన్నారు. సచివాలయ భవనాన్ని కూల్చి వేసి దాని స్థానంలో 10 అంతస్తులతో కూడిన నూతన సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఎర్ర మంజిల్ ప్యాలస్ ని కూల్చివేసి, అక్కడ కొత్తగా శాసనసభ, శాసనమండలి భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. 

ఖైరతాబాద్-పంజాగుట్ట మధ్యగల ఎర్ర మంజిల్ ప్యాలస్ లో ప్రస్తుతం జలసౌధ కార్యాలయం, ఏపికి చెందిన రోడ్లు భవనాల శాఖలు ఉన్నాయి. వాటిని వేరే చోటికి తరలించి ఆ భవనాన్ని కూల్చి వేయాలని నిర్ణయించారు. అందుకు కారణం ఏమిటంటే, ప్రస్తుతం శాసనసభ, మండలి భవనాలు ఇరుకుగా, చాలా అసౌకర్యంగా ఉన్నాయిట! అవి కేవలం 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడ్డాయి కానీ ఎర్రమంజిల్ ప్యాలస్ 15ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కనుక దానిని కూల్చివేసి అక్కడ అన్ని హంగులతో ఆధునిక సౌకర్యాలతో కూడిన విశాలమైన భవనాలు నిర్మించుకొంటే బాగుంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయం.  

ఎర్ర మంజిల్ ప్యాలస్ ని 1870 లో నిజాం నవాబులు నిర్మించారు. అది నగరంలో ఉన్న అనేక చారిత్రిక, వారసత్వ కట్టడాలలో ఒకటి. హైదరాబాద్ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్, గోల్కొండ కోటలే తప్ప హైటెక్ సిటీ, రింగు రోడ్డులు కాదు. నిజాం నవాబుని ఎంతో ఆరాధించే కెసిఆర్ ప్రతీ ఏటా గోల్కొండ కోటలోనే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు కూడా. 

హైదరాబాద్ నగరం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ అటువంటి చారిత్రిక కట్టడాల వలననే నగరానికి, రాష్ట్రానికి కూడా దేశవిదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నప్పుడు, వాటన్నిటినీ ఒకటొకటిగా కూల్చివేయాలని ఎందుకు ఆలోచిస్తున్నారో ఆయనకే తెలియాలి. అవిలేని హైదరాబాద్ నగరాన్ని ఊహించుకోవడమే కష్టం. ఎర్ర మంజిల్ ప్యాలస్ స్థానంలో నూతన శాసనసభ, మండలి భవనాలని నిర్మించిన తరువాత పాత భవనాలు నిరుపయోగంగా మారుతాయి కనుక అప్పుడు వాటినీ కూల్చి వేస్తారేమో?

అయన కలలుగంటున్న బంగారి తెలంగాణాలో ఆ చారిత్రిక కట్టడాలని కూడా భాగంగా చేసుకోవాలే తప్ప వాటిని నిర్మూలించి ఆధునిక భవనాలని కట్టుకోవాలనే ఆలోచన సరికాదనే చెప్పక తప్పదు. అంతగా అవసరమైతే నగర శివార్లలో ఖాళీగా ఉన్న భూములలో ప్రభుత్వం భవనాలు, కార్యాలయాలు నిర్మించుకొన్నట్లయితే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయి. 

కెసిఆర్ చేస్తున్న ఇటువంటి ఆలోచనలని ప్రతిపక్షాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆయన తన ధోరణిలోనే సాగిపోతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎర్ర మంజిల్ ప్యాలస్ కూల్చివేయాలనే ఆయన నిర్ణయాన్ని బహుశః తప్పుపడుతూ ప్రతిపక్షాలు రేపు ఆందోళనలు చేయవచ్చు. కెసిఆర్ అప్పుడు తన ఆలోచనని విరమించుకోవలసి రావచ్చు. కనుక ఇటువంటి ఆలోచనలు చేయడం ఎందుకు? విమర్శలు మూటగట్టుకొని వెనక్కి తగ్గి నవ్వులపాలవడం ఎందుకు?     



Related Post