రెండు నెలలలో అంతమంది ఆత్మహత్యలా?

October 19, 2016


img

తెలంగాణా ఏర్పడితే అందరి కష్టాలు తీరుతాయనుకొంటే రాష్ట్రంలో నేటికీ అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక స్థాయిలో చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజలు గతుకుల రోడ్లు, చైన్ స్నాచర్స్ వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, తెలంగాణా రైతన్నలు తీవ్ర ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్ రెండు నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా 134 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొన్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయం ప్రతిపక్షాలు చెపితే అనుమానించవచ్చు కానీ రాజకీయాలతో సంబంధం లేని తెలంగాణా రైతు జేఏసి బయటపెట్టడంతో నమ్మక తప్పడం లేదు. 

దాని కన్వీనర్ డా.జలపతి రావు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “గత ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా జరిగిన పంట నష్టానికి కేంద్ర ప్రభుత్వం రూ. 703 కోట్లు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దానిని రైతులకి చెల్లించలేదు. అలాగే రైతులకి ఎంతో కీలకమైన ఆగస్ట్ నెలలో రెండు వారాలు  గడిచిపోయేవరకు కొత్తగా పంట రుణాలు మంజూరు చేయలేదు. మూడవ దశ పంట రుణాల మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు విడుదల చేయకపోవడంతో రైతులు ఇంకా నష్టపోయారు. ఆ కారణంగా గత ఏడాది జరిగిన పంట నష్టానికి భీమా చేయించుకోవడానికి అర్హత పొందలేకపోయారు.” 

“ఈ ఆర్ధిక సమస్యలు తట్టుకోలేక గత రెండు నెలలోనే 134 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధ కలిగిస్తోంది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తక్షణమే రైతన్నలని ఆదుకోవాలి. వారి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకు అక్టోబర్ 23వ తేదీన నగరంలోని ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేపట్టాలని నిర్ణయించుకొన్నాము. రైతన్నల కోసం చేస్తున్న ఈ దీక్షకి ప్రజలు, ఉద్యోగులు, విద్యార్ధులు అందరూ సంఘీభావం ప్రకటించాలని కోరుకొంటున్నాము,” అని అన్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం దీక్షకి సంబంధించిన పోస్టర్లని విడుదల చేశారు. ఈ దీక్షలో డిమాండ్లు ఏమిటంటే:

1. తెరాస ప్రకటించిన పంట రుణాల మాఫీని ఒకేసారి మొత్తం మాఫీ చేయాలి. 

2. తక్షణమే రైతులకి, కౌలు రైతులకి, మహిళా రైతులకి అందరికీ పంట రుణాలు మంజూరు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

3. పంట నష్టపోయిన రైతులు అందరికీ ప్రభుత్వం తక్షణమే ఇన్-పుట్ సబ్సిడీ చెల్లించాలి. ఈ సీజన్ లో మొన్న బారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి కూడా నష్టపరిహారం చెల్లింపు కోసం కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి.

4. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.వో.123తో సహా దానికి అనుబంధంగా జారీ చేసిన జీవోలని అన్నిటినీ ఉపసంహరించుకోవాలి. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూసేకరణ జరపాలి. ఈ భూసేకరణ వలన నష్టపోయిన రైతులు అందరికీ వేరే చోట సాగుచేసుకోవడానికి భూములు ఇవ్వాలి.

5. రాష్ట్రంలో రైతన్నలని ఆదుకోవడానికి, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించాలి. 

6. రైతన్నలు ఇచ్చిన పంటనష్టం వివరాల ప్రకారమే వారికి తక్షణం ఇన్-పుట్ సబ్సీడీ చెల్లించాలి.


Related Post