హరీష్ రావుకి ఆశీసులు మాత్రమే!

October 12, 2016


img

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు తన మేనల్లుడు, రాష్ట్ర  సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావుపై ప్రశంశలు కురిపించారు. సిద్ధిపేట నియోజకవర్గాన్ని తను వదులుకొంటున్నప్పుడు చాలా బాధ కలిగిందని కానీ సమర్ధుడైన హరీష్ రావు దానిని చాలా చక్కగా చూసుకొంటున్నారని, సిద్ధిపేట అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారని కెసిఆర్ ప్రశంశించారు. హరీష్ రావుకి ఎల్లప్పుడూ తన ఆశీస్సులు ఉంటాయని కెసిఆర్ చెప్పారు.

మంత్రి హరీష్ రావు చాలా సమర్ధుడని అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయం ఆయన ఇప్పటికే చాలాసార్లు నిరూపించి చూపారు కూడా. కనుక ముఖ్యమంత్రి పొగడ్తలలో అతిశయోక్తి ఏమాత్రం లేదని చెప్పవచ్చు. 

హరీష్ రావుకి తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పడం కూడా సహజమే. కానీ హరీష్ రావుకి నిజంగానే కెసిఆర్ ఈయవలసినంత ప్రాధాన్యత ఇస్తున్నారా? అంటే అనుమానమే. నిజానికి ఒకానొకప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడినట్లు వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలుసు. కానీ కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత తన కుమారుడు కెటిఆర్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఆయనని తన పదవికి, పార్టీకి కూడా వారసుడుగా తీర్చిదిద్దుతుండటం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కెటిఆర్ కూడా తన సమర్ధతని నిరూపించుకోవడం చేత కెసిఆర్ ని ఎవరూ వేలెత్తి చూపే సాహసం చేయలేకపోయారు. కెటిఆర్ కూడా తన తండ్రి అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ క్రమంగా ప్రభుత్వంలో, పార్టీలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగారు. 

కెటిఆర్ ఎదుగుతున్న కొద్దీ  హరీష్ రావు పరిధి కుంచించుకుపోతున్నట్లు అయ్యింది. ఇప్పుడు ఆయన తనకి కేటాయించిన సాగునీటి శాఖ పనులకే పూర్తిగా అంకితమైపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ఆయన ఆ పరిధిలో ఉన్నంత కాలం ఆయనకి కెసిఆర్ ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు. అంటే తన కుమారుడు కెటిఆర్ కి తన రాజకీయ వారసత్వం కట్టబెడుతూ హరీష్ రావుకి ఆశీస్సులతో సరిపెడుతున్నారని భావించవచ్చు.


Related Post