రాహుల్ నాయకత్వంపై మళ్ళీ సందేహం?

October 12, 2016


img

రాహుల్ గాంధీని ఆయన తల్లి సోనియా గాంధీ దేశానికి ప్రధానమంత్రిని చేయాలని కలలుగంటుంటే, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి అవసరమైన నాయకత్వ లక్షణాలు లేవని ఆ పార్టీలో సీనియర్ నేతలే తేల్చి చెప్పడంతో ఉపాధ్యక్ష పదవికే పరిమితం కావలసివచ్చింది. ఆ తరువాత ఆయన త్వరలో అధ్యక్ష పదవి చేపడతారని జైరాం రమేష్ వంటి కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ ఇంతవరకు అటువంటి ప్రయత్నమేదీ చేసినట్లు కనిపించలేదు.

సోనియా గాంధీ తరచూ అనారోగ్యం పాలవుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ పట్ల పార్టీలో నెలకొన్న వ్యతిరేకత దృష్ట్యా ఆమే పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగవలసివస్తోంది. ఆ పదవిని వేరొకరికి అప్పగించినట్లయితే రాహుల్ గాంధీని పక్కనపెట్టినట్లు అవుతుంది. మున్ముందు అది ఆయన రాజకీయ జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కనుక తప్పనిసరిగా రాహుల్ గాంధీకే ఆ పదవిని కట్టబెట్టవలసి ఉంటుంది. కానీ కట్టబెట్టలేని పరిస్థితులు పార్టీలో నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొంత అయోమయం నెలకొని ఉందని చెప్పవచ్చు.

రాహుల్ గాంధీ అసలు ఏమీ జరగనట్లు తన పనులు తాను చేసుకొని పోతున్నారు తప్ప అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఇప్పుడు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో పార్టీలో నేతలు కూడా ఆయన నాయకత్వ లక్షణాలని ప్రశ్నించడం మానుకొన్నారిప్పుడు. కానీ ఆయన సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించినదుకు ఆయన మొదట ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేయడం, ఆ తరువాత అయనపై మళ్ళీ విమర్శలు చేయడం రాజకీయంగా చాలా పొరపాటని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎవరూ కూడా రాహుల్ గాంధీ ప్రదర్శించిన ఈ ద్వంద వైఖరిపై నోరు విప్పి మాట్లాడకపోవడం గమనిస్తే వారు కూడా ఆయనని వ్యతిరేకిస్తున్నారని భావించవలసి ఉంటుంది లేకుంటే అందరూ ఆయన వెనుకే కోరస్ పాడి ఉండేవారు.

జాతీయ స్థాయిలో సీనియర్ నేతలు మౌనం వహించినప్పటికీ, మధ్యప్రదేశ్ లో బర్వాని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శైలేష్ చోబే, రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలని ప్రశ్నించడం ఆ పార్టీలో మళ్ళీ కలకలం రేపుతోంది. సర్జికల్ స్ట్రయిక్స్ పై రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో తాను ఏకీభవించడంలేదని, దేశ భద్రతకి సంబంధించిన అటువంటి సున్నితమైన అంశాలపై రాహుల్ గాంధీ రాజకీయాలు చేయడం తగదని అయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉచితానుచితాలు తెలుసుకోకుండా మాట్లాడే రాహుల్ గాంధీ వలన పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని కనుక ఆయనని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన సోనియా గాంధీని కోరారు. నాయకత్వ లక్షణాలు లేని రాహుల్ గాంధీ క్రింద తాము పనిచేయలేమంటూ చిన్న చురుక కూడా వేశారు. 

బహుశః ఆయన పార్టీ మారే ఉద్దేశ్యంతోనే అంత సాహసంగా మాట్లాడి ఉండవచ్చు. కానీ ఈ సందర్భంలో కూడా ఆయన రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవని చెప్పడం ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అభిప్రాయంగానే భావించవచ్చు. రాహుల్ గాంధీని పార్టీ నుంచి బహిష్కరించమన్నందుకు ముందుగా శైలేష్ చోబేనే పార్టీ నుంచి బహిష్కరించవచ్చు కానీ రాహుల్ గాంధీ పట్ల పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఈ నిశ్చితాభిప్రాయాన్ని మార్చడం కష్టమే. అది మారాలంటే రాహుల్ గాంధీ తన నాయకత్వ లక్షణాలు కనబరుచుకోవాలి. అది అసాధ్యమే కనుక ఇదీ అసాద్యమేనని భావించక తప్పదు. 

  



Related Post