ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని అధికార సమాజ్ వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్ యాదవ్, కొడుకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం ఇప్పుడు పూర్తిగా చల్లబడినట్లు కనిపిస్తున్నప్పటికీ అంత సవ్యంగా లేదని మాత్రం చెప్పకతప్పదు. ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తన కొడుకు అఖిలేష్ యాదవ్ ని తొలగించి తమ్ముడు శివపాల్ యాదవ్ అతని స్థానంలో నియమించడంతో పార్టీపై ముఖ్యమంత్రికి ఏమాత్రం నియంత్రణ లేకుండా చేసినట్లయింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ చేసిన ఈ మార్పుల వలన పార్టీ తీసుకొనే నిర్ణయాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాదనలేని పరిస్థితి ఏర్పడింది కానీ ముఖ్యమంత్రి తీసుకొనే నిర్ణయాలని పార్టీ అడ్డుకోగల ఆధిక్యత ఏర్పడింది. ఇది ఏ ముఖ్యమంత్రయినా జీర్ణించుకోలేని విషయమే.
ఇటువంటి పరిస్థితిలో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేయడం ఆలోచించవలసిన విషయమే. గతంలోనే ఆయన రాహుల్ గాంధీ చాలా మంచి వ్యక్తి అని ఆయనతో తను స్నేహం కోరుకొంటున్నానని స్పష్టంగానే చెప్పారు. మళ్ళీ ఈరోజు కూడా అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీకి అనుకూలంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీతో పొత్తులకి సిద్దం అనే సంకేతాలు పంపారు.
“సర్జికల్ స్ట్రయిక్స్ గురించి రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన విమర్శలు చాలా ఆలోచించి చేసినవిగానే కనిపిస్తున్నాయి. మోడీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ది కోసమే ఉపయోగించుకొంటున్నారన్న రాహుల్ గాంధీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీతో స్నేహం కోసం నేనీమాట చెప్పడం లేదు. రాహుల్ గాంధీతో నాకు మంచి స్నేహం ఉన్నందునే చెపుతున్నాను. దేశంలో నిరు పేదలు, రైతులు నానా కష్టాలు పడుతున్నారు. వారికి ఈ సర్జికల్ స్ట్రయిక్స్ గురించి ఏమి అవసరం? వారికి చేయూత అందించే ప్రభుత్వం కావాలి. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని నేను భావిస్తున్నాను,” అని అఖిలేష్ యాదవ్ అన్నారు.
అఖిలేష్ యాదవ్ పరిస్థితి ప్రస్తుతం కొంచెం దయనీయంగానే ఉందని చెప్పక తప్పదు. తన చెప్పు చేతలలో ఉండవలసిన పార్టీ ముందు ఇప్పుడు ఆయన అణిగిమణిగి వ్యవహరించవలసి వస్తోంది. స్వయంగా తండ్రి, చిన్నాన్న తనపై పగబట్టినట్లు వ్యవహరిస్తుండటంతో ముఖ్యమంత్రిగా ఉన్నపటికీ ప్రభుత్వంలో గౌరవం కోల్పోయారు. కనుక మారిన ఈ రాజకీయ పరిస్థితులని దృష్టిలో ఉంచుకొనే ఆయన కాంగ్రెస్ పార్టీతో చెలిమికి ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. కానీ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దం అయితే, సమాజ్ వాదీ పార్టీ అందుకు అంగీకరిస్తుందా? అనే అనుమానం ఉంది. ప్రస్తుతం తను ఎదుర్కొంటున్న ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడటానికే అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఒకవేళ తన పార్టీ అడ్డుపడినట్లయితే అప్పుడు ఆయన పార్టీలో, ప్రభుత్వంలో తన అనుకూలవర్గంతో కలిసి పార్టీని చీల్చే ప్రయత్నం చేసినా చేయవచ్చు. వచ్చే ఏడాది జరుగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కూడా చాల ముఖ్యం కనుక అఖిలేష్ యాదవ్ ప్రతిపాదనకి సానుకూలంగానే స్పందించవచ్చు. కనుక రానున్న రోజుల్లో యూపి రాజకీయాలలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు, సమీకరణల మార్పులు జరిగే అవకాశాలున్నాయి.