ఇవే రకం రాజకీయాలో?

October 10, 2016


img

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యం పాలవడంతో ఆ రాష్ట్రంలో అకస్మాత్తుగా రాజకీయ శూన్యత ఏర్పడినట్లయింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు లోలోన చాలా తహతహలాడుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులలో తమ మనసులో ఆ ఆరాటాన్ని బయటపెట్టుకోవడానికి భయపడుతున్నాయి. 

చక్రాల కుర్చీకి, మంచానికే పరిమితమైన డిఎంకె పార్టీ అధినేత కరుణానిధి అందరికంటే ముందుగా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి జయలలితకి ఏమయిందో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఆయన కొడుకు స్టాలిన్ మరొక అడుగు ముందుకు వేసి జయలలిత కోలుకొనే వరకు అధికార అన్నాడిఎంకె ప్రభుత్వంలో మంత్రులు ఎవరైనా తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాలని సూచించారు. తద్వారా ఆ పార్టీలో ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన సీనియర్స్ ని ప్రోత్సహించారని చెప్పవచ్చు. ఆయన గురిచూసి వేసిన బాణం సరిగ్గానే తగిలింది. ఆ పార్టీలో సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళని స్వామి మొన్న గవర్నర్ ని కలిసి చాలాసేపు చర్చించారు. ఇక రాజ్ భవన్ నుంచి ప్రకటన వెలువడుతుందని అందరూ అనుకొంటున్న సమయంలో అన్నాడిఎంకెలో కొందరు సీనియర్ నేతలు అటువంటి ప్రయత్నాలని అడ్డుకొంటామని స్పష్టం చేయడంతో ఆ ఆలోచన విరమించుకొన్నట్లు కనిపిస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రోజుల క్రితం జయలలితని పరామర్శించేందుకు అకస్మాత్తుగా చెన్నై వెళ్ళినప్పుడు భాజపా నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన ఈ వంకతో అన్నాడిఎంకె పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయనపై అనుమానం వ్యక్తం చేసిన భాజపా కూడా ఇప్పుడు అదే పని చేస్తుండటం విశేషం. 

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నిన్న చెన్నై వెళ్ళి ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి వాకబు చేసిన తరువాత గవర్నర్ విద్యాసాగర్ రావుతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “జయలలిత గొప్ప పోరాట యోధురాలు. త్వరలోనే ఆమె కోలుకొని మళ్ళీ తన బాధ్యతలు నిర్వర్తిస్తారని నేను నమ్ముతున్నాను. ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి ఎటువంటి పుకార్లు ప్రచారం చేయవద్దు. వినవద్దు. ఆమె కోలుకొంటున్నారని వైద్యులు చెప్పారు,” అని అన్నారు. 

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో అన్నాడిఎంకె పార్టీతో పొత్తుల కోసం కాంగ్రెస్, భాజపాలు రెండూ చాలా ప్రయత్నించాయి. కానీ జయలలిత తిరస్కరించడంతో కాంగ్రెస్ పార్టీ కరుణానిధి పంచన చేరింది. ఆ కారణంగా భాజపా ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయం, అవమానం ఎదుర్కొంది. 

కాంగ్రెస్ పార్టీ డిఎంకెతో ఉన్నప్పటికీ అదిప్పుడు ప్రతిపక్షంలో ఉంది కనుక, ఈ అవకాశాన్ని వినియోగించుకొని అన్నాడిఎంకెకి దగ్గరవ్వాలని యోచిస్తే అదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. బహుశః అందుకే రాహుల్ గాంధీ హడావుడిగా చెన్నైలో వాలిపోయి తమ పార్టీ ఆమెకి, అన్నాడిఎంకెకి అండగా ఉంటుందని ప్రకటించి ఉండవచ్చు. అది చూసి వెంకయ్య నాయుడు కూడా చెన్నైలో వాలిపోయి హడావుడి చేస్తున్నట్లుంది. 

సాధారణంగా మనిషి పోగానే చేసేవి శవరాజకీయాలని చెప్పుకొంటాము. కానీ జయలలిత తీవ్ర అనారోగ్యం పాలయ్యారని తెలియగానే అని పార్టీలు చేస్తున్న ఈ రాజకీయాలకి ఏమని పేరు పెట్టాలో? 



Related Post