అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ మధ్య అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి సెయింట్ లూయీస్ లో ముఖాముఖి చర్చ జరిగింది. దానిలో కూడా మళ్ళీ హిల్లరీ క్లింటన్ ఆధిఖ్యత సాధించారు. తాజాగా నిర్వహించిన సర్వేలో హిల్లరీకి దేశంలో 57 శాతం మంది ప్రజలు మద్దతు పలుకగా, ట్రంప్ కి కేవలం 34శాతం మంది మాత్రమే మద్దతు పలికారు.
దీనికి ప్రధాన కారణం మహిళలతో శృంగారం, వారి అందచందాల గురించి ట్రంప్ ఒకప్పుడు వాగిన వాగుడే. ఆయన పరాయి మహిళల గురించే కాకుండా తన స్వంత కూతురు అందచందాల గురించి కూడా ఒకప్పుడు మాట్లాడిన మాటలు కీలకమైన ఈ ‘బిగ్ డిబేట్’ కి ముందు మీడియా బయటపెట్టడం వలన అకస్మాత్తుగా ఆయన పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగేలా చేసింది. దానిని హిల్లరీ క్లింటన్ చాలా తెలివిగా వినియోగించుకొని ఆయన చేత బిగ్ డిబేట్ లోనే మహిళలకి క్షమాపణలు చెప్పించడంతో ఆయనపై ఆధిక్యత సాధించగలిగారు.
ట్రంప్ వాగుడుకి ఆయన భార్య మెలానియా, వారి కుమారుడు ఎరిక్ కూడా దేశప్రజలకి క్షమాపణలు చెప్పుకోవవలసి వచ్చింది. కానీ దాని వలన ఆశించిన ఫలితం రాకపోగా ప్రజలకి ట్రంప్ గురించి ఇంకా తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. ఆయన ప్రవర్తన స్వంత కుటుంబ సభ్యులు కూడా ఆమోదించలేకపోతున్నారని కానీ తప్పనిసరిగా భరించవలసివస్తోందని చాటిచెప్పినట్లయింది.
అత్యంత కీలకమైన రెండవ రౌండ్ కి ముందు అమెరికన్ మీడియా ట్రంప్ కి నష్టం కలిగించి, ఆయన విజయావకాశాలని దారుణంగా దెబ్బతీసే ఇటువంటి విషయాలు ప్రసారం చేయడాన్ని యాదృచ్చికమని భావించలేము. అది ట్రంప్ పట్ల వాటి వ్యతిరేకతకి నిదర్శనంగా చెప్పవచ్చు. మీడియా ఒక్కటే కాదు..ఆ వార్తలు ఇటువంటి కీలక సమయంలో ప్రసారం అవడం వెనుక ట్రంప్ ని వ్యతిరేకించే అనేక వర్గాలు, సంస్థలు, పారిశ్రామికవేత్తలు వగైరా ఉండి ఉండవచ్చు. అందరూ కలిసి ఒక పద్ధతి ప్రకారమే ట్రంప్ ని దెబ్బ తీస్తున్నట్లు భావించవచ్చు.
అందుకు ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు కానీ ప్రధాన కారణం మాత్రం అహంకారంతో కూడిన ట్రంప్ అనుచిత ప్రసంగాలేనని చెప్పవచ్చు. ముఖ్యంగా దేశంలోని మహిళలు, ముస్లింలు, విదేశీయుల పట్ల ఆయన వాగిన అసందర్భ ప్రేలాపనలే ఆయనకి శత్రువులని సృష్టించాయని చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ అంశాలపై ఆయన తన రిపబ్లికన్ పార్టీ విధివిధానాలకి లోబడకుండా తన స్వంత విధివిధానాలు ప్రకటించడం కూడా ఆయనకి పార్టీ అండదండలు కోల్పోయేలా చేసింది.
మొదట్లో ట్రంప్ దూకుడు చూసి దేశానికి అటువంటి వ్యక్తి చాలా అవసరమని కొంత మంది అమెరికన్స్ భావించినప్పటికీ, మీడియా బయటపెడుతున్న ఈ అనుచిత ప్రేలాపనలు వాటిని కప్పి పుచ్చుకొనే ప్రయత్నంలో మళ్ళీ మహిళా అభ్యర్ధి అయిన హిల్లారీ క్లింటన్ పై ఎదురుదాడికి దిగడం వంటివన్నీ వారిని ట్రంప్ కి దూరం చేస్తున్నాయి.
ఎన్నికల ప్రక్రియ కీలక దశకి చేరుకొనే సమయంలో ట్రంప్ పట్ల సర్వత్రా కనబడుతున్న ఈ వ్యతిరేక వాతావరణం ఒకటి రెండు ముఖాముఖి చర్చల వలన ఏర్పడింది కాదని చెప్పవచ్చు. అమెరికాలో వివిధ వర్గాలలో ట్రంప్ అభ్యర్ధిత్వం పట్ల ఇంతవరకు నిగూడంగా ఉన్న వ్యతిరేకత అదును చూసి బయటపడుతున్నట్లు భావించవచ్చు.
ఇంటా(స్వంత పార్టీలో) బయటా తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేస్తున్న ట్రంప్ విజయం సాధిస్తారో లేదో నవంబర్ నెలలో జరిగే అధ్యక్ష ఎన్నికలలో తేలిపోతుంది. ఒకవేళ హిల్లరీ క్లింటన్ చేతిలో ఆయన ఓడిపోయినట్లయితే మహిళల పట్ల అనుచితంగా మాట్లాడినందుకు చాలా బారీ మూల్యమే చెల్లించినట్లు అవుతుంది. అంతేకాదు మహిళల గురించి చులకనగా మాట్లాడినందుకు చివరికి మహిళ చేతిలో ఓడిపోతే అప్పడైనా ఆయన తన తప్పుని గ్రహించి మారుతారో లేదో చూడాలి.