అయ్యో! హైదరాబాద్ లోనే ఇంత దారుణం జరిగిందా?

October 08, 2016


img

దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ కూడా ఒకటి. అక్కడే ఎవరూ ఊహించని ఒక దారుణం జరిగింది. ఆరాధన అనే 13 ఏళ్ళ బాలిక తమ జైన మతాచారాల ప్రకారం చౌమాస దీక్ష చేపట్టింది. దాని కోసం ఆమె ఏకంగా 68 రోజులు నిరాహార దీక్ష చేసింది. అన్ని రోజులు మంచి నీళ్ళు కూడా ముట్టలేదు. దీక్ష ముగించిన మరునాడే మరణించింది. ఆమె ఈ దీక్ష చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరికీ తెలుసు. కనుక నిరాహార దీక్షతో ఆమె ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు కానీ ఎవరూ ఆమెని వారించే ప్రయత్నం చేయలేదు. పైగా చాలా మంది ఆమెతో సెల్ఫీలు కూడా తీసుకొన్నారుట! ఈ విషయం ఆ బాలిక మరణించిన తరువాత ఆమె తాతగారు చెప్పారు. 

జైన మతాచారాల ప్రకారం ఆమెని ‘బాల తపస్వి’ గా గుర్తింపునిచ్చినట్లు అయన తెలిపారు. తపస్విని హోదా పొందిన కారణంగా ఆమె అంత్యక్రియలకి కుటుంబ సభ్యులతో సహా 600 మందికిపైగా  హాజరయ్యారు. ఈవిధంగా కటోర దీక్షలు చేసినవారికి జైన సమాజంలో చాలా గౌరవం ఇస్తారు. మత సంబంధమైన కార్యక్రమాలు,శుభ కార్యక్రమాలలో వారిని మత గురువులు, బంధుమిత్రులు కీర్తిస్తుంటారు. బహుశః ఇకపై ఆరాధనని కూడా వారు ఒక మహా తపస్వినిగా పూజించవచ్చు. 

ఇటువంటి మతాచారాలు నేటికీ కొనసాగుతూ వాటికి ఆరాధన వంటి అన్నెం పున్నెం తెలియని బాలికలు దానికి బలవుతున్నారంటే నమ్మశక్యంగా లేదు. ఆమెని అందరూ కలిసి ఆత్మహత్యకి ప్రోత్సహించినట్లేనని చెప్పక తప్పదు. ఒకప్పుడు సతీసహగమనం అనే దురాచారం అమలులో ఉన్నప్పుడు భర్త కోల్పోయిన స్త్రీలని భర్తతో పాటు చితిపై ఉంచి సజీవదహనం చేసేవారు. రాజా రామ్మోహన్ రాయ్ వంటి అనేకమంది సంఘ సంస్కర్తల పోరాటం వలన ఆ దురాచారాన్ని వదిలించుకోగలిగాము. కానీ ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో, అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరంలో ఇటువంటి మూడాఛారానికి అందరూ కలిసి ఒక బాలికని బలి చేయడం ఎవరూ ఊహించలేము. ఇంతకంటే దారుణం ఉండదు. ఈ వార్త మీడియాలో ప్రముఖంగా వచ్చినా, ఇంతవరకు ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ చివరికి మన న్యాయవ్యవస్థ గానీ స్పందించకపోవడం ఇంకా దిగ్బ్రాంతి కలిగిస్తోంది. అంటే సమాజం, మన వ్యవస్థలు కూడా ఈ ఘాతుకాన్ని ఆమోదిస్తున్నాయనుకోవాలా?   


Related Post