నేను లౌకికవాదిని కానీ బిజెపిలో చేరుతున్నా: ఈటల

June 05, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను లౌకికవాదినని కానీ పరిస్థితులు తనను బిజెపివైపు తీసుకువెళ్ళాయని అన్నారు. అంటే ఆయన అయిష్టంగా బిజెపిలో చేరుతున్నారా?తాను లౌకికవాదినే కానీ బీజేపీలో చేరుతున్నానని ఈటల చెప్పడం హాస్యస్పదంగా ఉంది. ఒకవేళ ఆయన నిజంగా లౌకికవాదానికి కట్టుబడి ఉంటే కాంగ్రెస్, తెలంగాణ జనసమితి లేదా వామపక్షాలలోనో చేరి ఉండాలి. ఒకవేళ రాష్ట్రంలో మరే పార్టీలు లేనట్లయితే ఆయన ఈ మాట అన్నా అర్ధం ఉండేది. కానీ ఇన్ని పార్టీలు ఉండగా కొన్ని పరిస్థితుల వలన బిజెపిలో చేరుతున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ పరిస్థితులు ఏమిటో ఆయన నోటితోనే చెప్పి ఉంటే బాగుండేది కానీ చెప్పకపోవడంతో టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు విశదీకరించి మరీ చెపుతున్నారు.

ఇప్పుడు బిజెపి చాలా రాష్ట్రాలలో ఎన్నికలలో గెలుస్తున్నప్పటికీ దాని మతతత్వముద్ర అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే బిజెపి దానిని పదిలంగా కాపాడుకొంటూ దాంతోనే ప్రత్యేక గుర్తింపు పొందుతోందని చెప్పవచ్చు. ఈవిషయం ఈటల రాజేందర్‌కు తెలియదనుకోలేము. ఆయన బిజెపిలో చేరబోతున్నారు కనుక ఇకపై ఆ కోణంలో నుంచే రాజకీయాలు చేయవలసి ఉంటుంది. ఆయన అలా చేయగలరా లేదా...బిజెపిలో ఇమడగలరా లేదా...?అనేది కాలమే చెపుతుంది.


Related Post