ప్రజల గొంతులు వినకుంటే..వినిపించకుంటే...

March 13, 2021


img

వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వానికైనా అహంభావం పెరిగి ఇక తనకు తిరుగులేదని భావిస్తూ, తాను పట్టిన కుందేలుకి మూడేకాళ్ళు అన్నట్లు వ్యవహరిస్తుంటుంది. మోడీ ప్రభుత్వం కూడా ఇందుకు మినహాయింపు కాదన్నట్లు వ్యవహరిస్తోంది. దాని వివాదాస్పద నిర్ణయాలు...వాటిపై దాని వైఖరి చూస్తే అర్ధమవుతుంది. 

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత 3 నెలలుగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు, వారు రాజకీయ దురుదేశ్యంతోనే ఆందోళనలు చేస్తున్నారన్నట్లు మాట్లాడిందే తప్ప వారి అభిప్రాయాలను గౌరవించి వెనక్కు తగ్గాలనుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వ రంగసంస్థలను అమ్మేసి ప్రైవేటీకరణ చేయడానికి సిద్దపడుతున్నప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి. 

సాధారణంగా ప్రభుత్వాలు ఏదైనా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటే ప్రతిపక్షాలు, ప్రజలు వాటిని గట్టిగా వ్యతిరేకిస్తుంటారు. కానీ కేంద్రప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ వ్యతిరేకించడమే అందుకు తాజా నిదర్శనం. కానీ రాష్ట్ర ప్రభుత్వాల వాదనలను సైతం రాజకీయకోణంలో నుంచే చూస్తూ ఎదురుదాడి చేసి వాటి నోళ్ళు మూయించాలని చూస్తుండటం విస్మయం కలిగిస్తుంది. 

ఎమ్మెల్సీ ఎన్నికలలో తమను గెలిపిస్తే మండలిలో ప్రజల గొంతు వినిపిస్తామని గట్టిగా చెపుతున్న బిజెపి నేతలు, ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలను ప్రజలు నిరసిస్తున్నప్పుడు, తమ పార్టీ అధిష్టానానికి, కేంద్రప్రభుత్వానికి ఈ విషయం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్రజలగొంతు ఎందుకు వినిపించలేకపోతున్నారు?ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలతో పార్టీ పట్ల ప్రజావ్యతిరేకత పెరుగుతుందని తెలిసి ఉన్నా గుడ్డిగా ఎందుకు సమర్ధించుకొంటున్నారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు ఇప్పుడు ప్రజలకు కావలసింది అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాది, మౌలికవసతులు తప్ప మతరాజకీయాలు కాదు. కానీ వాటితోనే ముందుకు సాగుతూ అదికారం సంపాదించుకోగలమని బిజెపి అనుకొంటుంటే అది అవివేకమే అవుతుంది. 

యూపీఏ ప్రభుత్వానికి బాగా అహంపెరిగి ప్రజల పట్ల అలసత్వం ప్రదర్శించినందుకు దానిని పక్కనపెట్టి బిజెపికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బిజెపి కూడా అదేవిదంగా వ్యవహరిస్తే చివరికి నష్టపోయేది ఎవరు? అని ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవలసి ఉంటుంది.


Related Post