భారత్‌ పట్ల జో బైడెన్‌ ఏవిధంగా వ్యవహరిస్తారో?

February 06, 2021


img

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో కలిసి గురువారం తమ ప్రభుత్వ విదేశాంగ విధానం గురించి మాట్లాడారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ హయాంలో మిత్రదేశాలతో   దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దుకొని ప్రపంచంతో కలిసి నడుస్తామని జో బైడెన్‌ అన్నారు. తమకు చైనా గట్టి పోటీదారుగా భావిస్తున్నామని దానిని ధీటుగా ఎదుర్కొంటామని అన్నారు. ముఖ్యంగా చైనా వ్యాపారధోరణులను, మానవహక్కుల ఉల్లంఘనలను, రాజ్యవిస్తరణ కాంక్షను గట్టిగా నిలదీస్తామని హెచ్చరించారు. చైనా తన ధోరణి మార్చుకొంటే దాంతో కలిసి పనిచేసేందుకు సిద్దమని జో బైడెన్‌ అన్నారు.    

అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్న రష్యాను ధీటుగా ఎదుర్కొంటామని జో బైడెన్‌ అన్నారు. అమెరికా వ్యవస్థలపై రష్యా సైబర్ ఆటాక్స్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతీన్‌ నిరంకుశ ధోరణిని ప్రశ్నిస్తున్న రష్యా ప్రజలపై విషప్రయోగాలు చేసి హత్యలు చేస్తుండటాన్ని జో బైడెన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించి తీవ్రంగా ఖండించారు. 

అయితే జో బైడెన్‌ ఈ తొలి ప్రసంగంలో ఎక్కడా భారత్‌ ప్రస్తావన లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చాలా దేశాలతో మొరటుగా వ్యవహరించినప్పటికీ ప్రధాని నరేంద్రమోడీతో స్నేహపూర్వకంగానే వ్యవహరించేవారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా భారత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. కనుక వారి మద్య చాలా బలమైన సంబంధాలుండేవి. ఆ కారణంగా భారత్‌-అమెరికాల మద్య సంబంధాలు కూడా చాలా బలంగా ఉండేవి. 

ట్రంప్‌తో పోలిస్తే జో బైడెన్‌ చాలా మృదుస్వభావి కనుక ఆయన భారత్‌ పట్ల చాలా సానుకూలధోరణితో వ్యవహరిస్తారనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఆయన ప్రభుత్వంలో కమలా హారిస్‌తో సహా 13 మంది భారత సంతతికి చెందినవారిని నియమించుకోవడం, భారతీయులకు ఊరట కలిగించే విధంగా హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు సడలించడం వంటివి అందుకు తొలి సంకేతమని వాదించేవారు కూడా ఉన్నారు. కానీ జో బైడెన్‌ తన తొలి ప్రసంగంలో భారత్‌ ప్రస్తావన చేయకపోవడం ఆశ్చర్యకరమే. బహుశః త్వరలోనే జో బైడెన్‌ భారత్‌ గురించి వేరేగా మాట్లాడుతారేమో... చూడాలి.


Related Post