నేడు శ్రీనివాస రామానుజన్ జయంతి

December 22, 2020


img

భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ గణిత శిఖరాలపై ఎగరవేసిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి నేడు. శ్రీనివాస రామానుజన్ 1887, డిసెంబర్‌ 22న తమిళనాడులోని (అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని) ఏరోడ్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించారు. బాల్యంలోనే తీవ్ర ఆర్ధిక, ఆరోగ్య సమస్యలను చవిచూసిన శ్రీనివాస రామానుజన్, చదువులలో ఎప్పుడూ ముందుండేవారు.

11 ఏళ్ళ వయసులోనే గణితం, ట్రిగనామెట్రీపై పూర్తి పట్టు సాధించారు. 13 ఏళ్ళ వయసులోనే అత్యంత సంక్లిష్టమైన గణిత సిద్దాంతాలను స్వయంగా రూపొందించారు. 14 ఏళ్ళ వయసులో డిగ్రీ ఇంకా ఆ పై చదువులు చదువుతున్న 1,200 మంది విద్యార్ధులకు గణితంలో పాఠాలు చెప్పేవారు. 35 మంది లెక్చరర్లు  భోదించే పాఠాలను 14 ఏళ్ళ శ్రీనివాస రామానుజన్ ఒక్కరే భోదించేవారంటే ఆయనకు ఎంత మేధోశక్తి ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇంగ్లీష్, సంస్కృతం తదితర సబ్జెక్టులలో ఆయన ఫెయిల్ అవుతుండేవారు. ఆ కారణంగా ఆయన మెట్రిక్‌తోనే విద్యాభ్యాసం ముగించారు. 

ఆ తరువాత కూడా కటిక దారిద్యం, ఆకలితో మాడుతూనే అనేక గణిత సిద్దాంతలను కనుగొన్నారు. అటువంటి దయనీయమైన పరిస్థితిలో జీవిస్తూ కుటుంబ పోషణ కొరకు సాధారణ గుమాస్తా ఉద్యోగాలకు ప్రయత్నించారు. ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు లభించడంలో చాలా ఆలస్యమైందని చెప్పడానికి అదే నిదర్శనం.

ఆ తరువాత ఇండియన్ మేధమెటికల్ సొసైటీ వ్యవస్థాపకుల సహాయసహకారాలతో 1912లో ఆయనకు మద్రాస్ అకౌంట్ జనరల్ కార్యాలయంలో నెలకు రూ.20 జీతంతో తాత్కాలిక గుమాస్తా ఉద్యోగం లభించింది. ఆవిధంగా చిన్న ఉద్యోగం చేసుకొంటూ బ్రిటన్ గణిత శాస్త్రవేత్తలతో పరిచయాలు పెంచుకొని చివరికి ప్రపంచంలోనే గొప్ప గణితశాస్త్రవేత్తగా పేరుపొందారు. అనేక క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించారు. అనేక గణిత సిద్దాంతాలను కనుగొని తన ప్రతిభను చాటుకొన్నారు.

ఓ పక్క ఆర్ధిక సమస్యలు, ఆరోగ్యసమస్యలతో సతమతమవుతూనే స్వీయప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీనివాస రామానుజన్ జీవితంలో ఏనాడూ నైరాశ్యానికి గురికాలేదు. జీవితంలో ఇంకా ఎంతో సాధించాలనుకొన్నారు. కానీ 32 ఏళ్ల వయసులోనే టీబీ వ్యాధితో (1920 ఏప్రిల్ 26న) చనిపోయారు. మ్యాన్ ఆఫ్ ఇన్ఫినిటీగా పేరొందిన శ్రీనివాస రామానుజన్ పేరిట ఏటా ఇవాళ్ళ ఆయన జయంతి రోజున (డిసెంబర్ 22న) జాతీయ గణితదినోత్సవం(మ్యాథమెటిక్స్ డే) జరుపుకుంటున్నాము.


Related Post