నిజామాబాద్‌ ఎన్నికలలో పోటీ చేయడమే తప్పయిందా?

October 03, 2020


img

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కవిత గెలుపు లాంఛనప్రాయమేనని మొదటే తేలిపోయింది. జిల్లాలో స్థానిక సంస్థలలో మొత్తం 824 మంది సభ్యులుండగా వారిలో టిఆర్ఎస్‌, మజ్లీస్ పార్టీలకు కలిపి 609 మంది  ఉన్నారు. కనుక కవిత నామినేషన్ వేసినప్పుడే ఆమె విజయం ఖాయం అయిపోయింది. ఇది తెలిసీ కాంగ్రెస్‌, బిజెపిలు తమ అభ్యర్ధులను బరిలో దింపాయి. ఇప్పుడు అదే ఆత్మహత్యతో సమానం అయ్యింది. 

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలలో కవితను ఓడించినందుకు బిజెపిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు టిఆర్ఎస్‌ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఓ అవకాశంగా తీసుకొంది. ఎన్నడూ బిజెపి జోలికి వెళ్లని టిఆర్ఎస్‌ ఈసారి మాత్రం బిజెపికి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఇతరులను టిఆర్ఎస్‌లో చేర్చుకొంటూ బిజెపికి షాక్ ఇస్తోంది. పనిలోపనిగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కూడా ఊడ్చిపెట్టేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 136 మంది, బిజెపికి 79 మంది సభ్యులున్నారు. వారిలో వీలైనంతమందిని టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపజేసేందుకు టిఆర్ఎస్‌ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగూ ఓడిపోతామని కాంగ్రెస్‌, బిజెపిలకు తెలుసు. కానీ ఇప్పుడు జిల్లాలో రెండు పార్టీలు ఖాళీ అయిపోతుండటంతో ఆ పార్టీల నేతలు తమ క్యాడర్‌ చేజారిపోకుండా కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసినా, చేయకపోయినా జరిగేది ఇదే...కనుక కాంగ్రెస్‌, బిజెపిలకు ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది. కనుక ఈ సమస్యను ఏవిధంగా ఎదుర్కోవాలో ఆ రెండు పార్టీలే ఆలోచించుకోవలసి ఉంటుంది. లేకుంటే భవిష్యత్‌లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో కూడా ఆ రెండు పార్టీలకు మళ్ళీ ఇదే సమస్య ఎదుర్కోక తప్పదు. అప్పుడు వాటికి అంత సమయం, అవకాశం కూడా ఉండదు కనుక ఆ ఎన్నికలలో మళ్ళీ భారీ మూల్యం చెల్లించవలసిరావచ్చు.


Related Post