శభాష్ శభాష్... ఇంకా అప్పులు చేసుకోండి!

September 24, 2020


img

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారుతుండటంతో అవి నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయి. అయితే రాష్ట్రాల నుంచి పన్నులు వస్తేనే కేంద్రం దగ్గర డబ్బులుంటాయి కనుక సమస్య పరిష్కారం కాకపోగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. డబ్బులు విదిలించకుండా అప్పులు తెచ్చుకోనీయకుండా అడ్డుపడుతున్న కేంద్రప్రభుత్వాన్ని ‘అమ్మ పెట్టదు...అడుక్కొని తిననీయదు...అంటూ రుసరుసలాడుతున్న రాష్ట్రాలను చూసి కేంద్రానికి ఉపాయం తట్టినట్లుంది. 

బిగ్‌బాస్ రియాలిటీ షోలోలాగా రాష్ట్రాలకు రకరకాల టాస్కులు (సంస్కరణలు) ఇచ్చి వాటిని చక్కగా పూర్తిచేస్తున్న వాటికి బహిరంగ మార్కెట్లు లేదా ఆర్ధిక సంస్థల నుంచి వేలకోట్లు అప్పులు తెచ్చుకొనేందుకు అనుమతిస్తోంది. 

అటువంటి టాస్కులే...‘వన్ నేషన్ వన్ రేషన్’ (దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన రేషన్ కార్డుతో వేరే ఏ రాష్ట్రంలోనైనా రేషన్ సరుకులు తీసుకొనే వెసులుబాటు కల్పించడం), ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపారాలు చేసుకొనేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించడం), అర్బన్ లోకల్ బాడీ, యుటిలిటీ రిఫార్మ్స్ (నగరాలు, పట్టణాలలో స్థానిక సంస్థలలో వినియోగ సంస్కరణలు), విద్యుత్ రంగంలో సంస్కరణలు (వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించడం వంటివి). వీటిలో ఒక్కో టాస్కుకు 0.25 శాతం వెయిటేజ్ చొప్పున కేటాయించింది. ఒకవేళ ఏ రాష్ట్రమైన నాలుగు టాస్కులు విజయవంతంగా అమలు చేసినట్లయితే ఆ రాష్ట్రానికి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీఎస్‌డీపీ)లో 1 శాతం రుణాలు తెచ్చుకొనేందుకు అనుమతిస్తుంది. మరో ఒక్క శాతం అప్పులు చేసుకొనేందుకు మరికొన్ని షరతులుంటాయి. 

జీఎస్‌డీపీలో 2 శాతం అంటే రూ.4,27,302 కోట్లు రాష్ట్రాలు అప్పులు చేసుకోవచ్చు! ఈ ఏడాది జూన్‌కు నెలలో జీఎస్‌డీపీలో 0.50 శాతం అంటే రూ. 1,06,830 కోట్లు అప్పులు తెచ్చుకోవడానికి కేంద్రం రాష్ట్రాలను అనుమతించింది.

ఈ నాలుగు టాస్కులలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, గోవా, త్రిపుర రాష్ట్రాలు ...‘వన్ నేషన్ వన్ రేషన్’ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాయి. కనుక వాటికి ఆర్ధిక సంస్థల నుంచి అప్పులు తెచ్చుకొనేందుకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో తెలంగాణకు రూ. 2,508 కోట్లు, ఏపీకి రూ.2,525 కోట్లు, కర్ణాటకకు రూ.4,509 కోట్లు, గోవాకు రూ.233 కోట్లు, త్రిపురకు రూ.148 కోట్లు కలిపి మొత్తం రూ.9,9913 కోట్లు అప్పులు చేసుకొనేందుకు కేంద్రం అనుమతించింది. 

అప్పులు చేసుకోవడానికి అనుమతిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటివి ఎన్ని టాస్కులైన చేయడానికి రెడీ అంటున్నాయి. ఆ సొమ్మును అవి ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు కానీ తీర్చక్కరలేదంటే అంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది? ఎన్ని వేలకోట్లు అప్పులు చేసినా ఆ భారం ఎలాగూ ప్రజల నెత్తినే పడుతుంది తప్ప ప్రభుత్వాలను నడుపుతున్న రాజకీయ పార్టీలపై కాదు. ఎందుకంటే అవి ఇవాళ్ళ ఉంటాయి...రేపు ఎన్నికలలో ఓడిపోతే దిగిపోతాయి కనుక! ఈవిధంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి పప్పు కూడు తినాలనుకొంటే చివరికి ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు.


Related Post